1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!

స్పెయిన్‌లో ఓ చర్చిలో లైంగిక వేధింపుల కేసులో 927 మంది నుంచి సాక్ష్యాధారాలు సేకరించినట్లు స్పెయిన్‌ రోమన్‌ క్యాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

Published : 02 Jun 2023 23:33 IST

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో ఓ చర్చిలో లైంగిక వేధింపులకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 1945 నుంచి అక్కడ 728 మంది లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని స్పెయిన్‌ రోమన్‌ క్యాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తంగా 927 మంది బాధితుల నుంచి సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలిపింది. ఈ లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులు, నిందితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉండటం గమనార్హం.

లైంగిక వేధింపులకు గురైన బాధితుల్లో 83శాతం అబ్బాయిలే. దాడికి పాల్పడిన వారిలో 99శాతం వారే. ఇందులో ఇప్పటివరకు 60శాతం మంది నిందితులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలిన వారిలో 50శాతం మంది మత పెద్దలేనని.. మిగతావారు సిబ్బంది అని తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో ఎక్కువ కేసులు గత శతాబ్దిలోనే జరిగాయని.. 75శాతం కేసులు 1990కి ముందే చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ లైంగిక కేసులకు సంబంధించిన సాక్ష్యాల నమోదు కొనసాగుతుందని.. వీటిని ఎప్పటికప్పుడు నవీకరిస్తామని పేర్కొంది.

స్పెయిన్‌ చర్చిలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2019లో నియమించిన కమిటీ వాటిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 200 మైనర్‌ సంరక్షణా కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరించింది. ముఖ్యంగా స్కూళ్లు, సెమినార్లు, స్థానిక చర్చిల్లో ఈ వేధింపు ఘటనలు ఎక్కువగా జరిగినట్లు గుర్తించింది. అయితే, వాస్తవంగా వీటి సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ఇదే వ్యవహారంపై మాడ్రిడ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ న్యాయ సంస్థ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఆ సంస్థ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ, బాధితుల సంఖ్య వేలల్లో ఉండవచ్చని మాత్రం ఇటీవల అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని