Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా

పార్లమెంట్‌ (Parliament) ఉభయసభల్లో కార్యకలాపాలను అడ్డుకోకుండా.. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla)కోరారు.

Published : 20 Mar 2023 21:23 IST

దిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తన వంతు ప్రయత్నం చేశారు. అన్ని పార్టీల ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభాకార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించకుండా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఆర్థిక బిల్లులు, బడ్జెట్‌పై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలని అన్నారు. అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా రాహుల్‌గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ భీష్మించు కూర్చుంటోదని కాంగ్రెస్‌ సహా పలువురు నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన భాజపా.. అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ధర్మాసనం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని వివరణ ఇచ్చింది.

రాహుల్‌ గాంధీ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ తాజా సమావేశంలోనూ భాజపా మరోసారి డిమాండ్‌ చేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం అవసరమంటూ రాహుల్‌ బ్రిటన్‌ పర్యటనలో వ్యాఖ్యానించారని భాజపా ఆరోపిస్తోంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయాన్ని కోరిన రాహుల్‌ గాంధీ.. లోక్‌సభలో వివరణ ఇస్తానని చెప్పారు. కానీ, తొలుత క్షమాపణలు చెప్పేంత వరకు లోక్‌సభలో ప్రసంగించనివ్వబోమని భాజపా నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. శనివారం విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశంలోనూ భాజపా ఇదే అంశాన్ని లేవనెత్తగా.. రాహుల్‌ గాంధీ సుదీర్ఘంగా మాట్లాడారు. భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని తాను ఏ దేశాన్నీ ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఇది భారత అంతర్గత విషయమని..దీన్ని అధికారంలో ఉన్న పార్టీయే పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ్యుల అడ్డంకులు, వాయిదాలతోనే సభాసమయం మొత్తం వృథా అవుతోంది. లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని భాజపా, అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ వివాదాల నడుమనే ఎలాంటి చర్చోపపర్చలు జరగకుండానే ప్రతిరోజూ ఉభయసభలు వాయిదాపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని