Disqualification of MLAs: ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గను: మహారాష్ట్ర స్పీకర్‌

స్పీకర్‌ పదవి ఏ పార్టీకి చెందినది కాదని, ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గనని మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ పేర్కొన్నారు.

Published : 12 May 2023 23:52 IST

ముంబయి: గతేడాది మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ వ్యవహారంలో స్పీకర్‌తో పాటు గవర్నర్‌ తీరును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని పేర్కొంది. దీంతో ఈ సంక్షోభం కాస్త ఇప్పుడు స్పీకర్‌ వైపు మళ్లింది. ఏక్‌నాథ్‌ శిందేతో సహా 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్‌.. ఈ విషయంలో నిర్ణయం ప్రకటించడంలో ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గనని ఉద్ఘాటించారు.

స్పీకర్‌ పదవి ఏ పార్టీకి చెందినది కాదని, ఈ పదవిలో ఎవ్వరు ఉన్నా సరే రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారమే నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గనని స్పష్టం చేశారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేయగా.. దీనిపై స్పీకర్‌కు లేఖ రాస్తానని ఠాక్రే సహచరుడు అనిల్‌ పరబ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌పై ఒత్తిడి తేవడం సరైనది కాదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. చట్టప్రకారం సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఇదిలాఉంటే, అసెంబ్లీలో ముందుగా అసలైన శివసేన ఏదో సరైన సమయంలో తేలుస్తానని ప్రస్తుత స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ తెలిపారు. అన్ని వర్గాల వాదనలను విన్నాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తీర్పును స్వాగతిస్తున్నానని, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వివరాలు సమర్పించేందుకు అందరికీ అవకాశమిస్తానని, ఎగ్జామినేషన్‌, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అయ్యాక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు