Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరి శిక్ష..

పద్నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే 49 మందిని

Updated : 18 Feb 2022 12:15 IST

అహ్మదాబాద్‌: పద్నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. నేడు వారికి శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో 38 మందికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మిగతా 11 మందికి జీవిత ఖైదు విధించింది.

2008 జులై 26న అహ్మదాబాద్‌ నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 56 మంది అమాయక ప్రజలు చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ముష్కరులు పేలుళ్లు జరిపిన ప్రదేశాల్లో అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలోని ట్రామా కేర్‌ సెంటర్‌ కూడా ఉంది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల నుంచి 78 మందిని అరెస్టు చేశారు. వీరికి నిషేధిత ఉగ్ర సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం)తో సంబంధాలున్నాయని గుర్తించారు. 2009 డిసెంబరులో విచారణ ప్రారంభం కాగా ఒక నిందితుడు అప్రూవర్‌గా మారడంతో మిగిలిన 77 మందిపై కోర్టులో విచారణ కొనసాగింది. పేలుళ్లకు సంబంధించి సూరత్‌, అహ్మదాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో వేర్వేరుగా 35 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 13 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 1,100 మంది సాక్ష్యులను విచారించారు.

గత ఏడాది సెప్టెంబరులో విచారణ ముగియగా వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మిగతా వారిని నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా దోషులకు నేడు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని