Sophisticated Weapons: చైనాకు దీటుగా ఆధునిక ఆయుధాలు

స్నేహమంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వద్ద కొర్రీలు పెట్టే చైనాతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ అనంతరం సైనిక బలగాలకు....

Published : 09 Aug 2021 01:16 IST

దిల్లీ: స్నేహమంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వద్ద కొర్రీలు పెట్టే చైనాతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ అనంతరం సైనిక బలగాలకు కేంద్రం ఆధునిక ఆయుధాలతో పాటు అక్కడి ఉష్ణోగ్రతలు తట్టుకునే షెల్టర్లను సమకూర్చింది. ఫార్వర్డ్  ఏరియాల్లో ఉండే సైనికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.

12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్టు నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ పొరుగు దేశం ఎప్పుడు ఎలాంటి అలజడి సృష్టించినా దీటుగా స్పందించే ఏర్పాట్లను పూర్తిచేశారు. చైనా సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్‌ సిగ్‌ సావర్‌ 716 అసాల్ట్‌ రైఫిళ్లు, స్విస్‌ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి సమకూర్చింది. లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి న్యోమా వద్ద కాపలా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలు అందించినట్లు భారత సైన్యం వెల్లడించింది.

లద్దాఖ్ ప్రాంతం హిమాలయ పర్వతాల సమీపంలో ఉండటంతో గడ్డకట్టించే చలి సైనికులకు ఎప్పుడూ పలు సవాళ్లను విసురుతూనే ఉంటుంది. శీతాకాలంలో లద్దాఖ్‌లోని వాస్తవాధీనరేఖ వెంబడి ఉష్ణోగ్రతలు మైనస్‌ 35 నుంచి 40 డిగ్రీల వరకు పడిపోతూఉంటాయి. ఈనేపథ్యంలో సైనిక బలగాలు ఉండేందుకు అత్యంత వేగంగా నిర్మించే ఫాస్ట్‌ ఎరెక్టబుల్‌ మాడ్యులార్‌ షెల్టర్లను కేంద్రం సమకూర్చింది. ఫార్వర్డ్‌ ఏరియాల్లో కాపలాకాసే సైనికులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. చాలా వేగంగా నిర్మించే సౌలభ్యమున్న ఈ షెల్టర్లలో 8 మంది నుంచి 40 మంది వరకు సైనికులు ఉండవచ్చు. అవసరాన్ని బట్టి వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకునే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని