SpiceJet: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్‌.. 50శాతం విమానాలనే నడపాలంటూ ఆదేశం

విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ షాకిచ్చింది.........

Published : 27 Jul 2022 20:14 IST

దిల్లీ: విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానయాన సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) షాకిచ్చింది. ఎనిమిది వారాలపాటు స్పైస్‌జెట్‌ విమానాలను 50శాతం మాత్రమే నడపాలంటూ డీజీసీఏ ఆంక్షలు విధించింది. ప్రయాణికుల నుంచి  ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు చేపట్టింది. ‘‘తక్షణ తనిఖీలు, దర్యాప్తులు, ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల అనంతరం సురక్షితమైన, నమ్మదగిన విమాన సేవలను కొనసాగించేందుకు.. స్పైస్‌జెట్ విమాన సర్వీసుల సంఖ్యను ఎనిమిది వారాలపాటు 50శాతానికి పరిమితం చేస్తున్నాం’’ అని డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇటీవల 18 రోజుల వ్యవధిలో ఎనిమిది స్పైస్‌జెట్‌ (SpiceJet)విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఆంక్షలు విధించింది. ఇటీవలి కాలంలో ఓ విమానయాన సంస్థపై రెగులేటరీ సంస్థ తీసుకున్న కఠిన నిర్ణయం ఇదే.

జులై 5న చైనాకు వెళుతున్న స్పైస్‌జెట్‌ విమానం రాడార్‌ పనిచేయకపోవడంతో కోల్‌కతాకు తిరుగు ప్రయాణమైంది. అదే రోజు దిల్లీ-దుబాయి విమానాన్ని ఫ్యూయల్‌ ఇండికేటర్‌లో లోపం కారణంగా కరాచీలో అత్యవసరంగా లాండ్‌ చేయాల్సి వచ్చింది. అంతకుముందు ఓ విమానంలో పొగలు రాగా.. మరో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో స్పైస్‌జెట్‌ విమానాలపై విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని