Spicejet: స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్తోన్న స్పైస్‌జెట్‌ ఎస్‌జీ - 11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్యుయల్‌ ఇండికేటర్‌లో

Updated : 05 Jul 2022 15:54 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్తోన్న స్పైస్‌జెట్‌ ఎస్‌జీ - 11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్యుయల్‌ ఇండికేటర్‌లో సమస్య తలెత్తడంతో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి దారిమళ్లించారు. కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా దించేశారు. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్‌ విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఆరోసారి.

తాజా ఘటనపై స్పైస్‌జెట్ స్పందించింది. ఇండికేటర్‌ సమస్య కారణంగా విమానం ఆగిపోవాల్సి వచ్చిందని సంస్థ అధికారి ప్రతినిధి తెలిపారు. ఎడమ ట్యాంక్‌లో అసాధారణ స్థాయిలో ఇందనం తగ్గినట్లు ఇండికేటర్‌ చూపించింది. అయితే గతంలో ఈ విమానానికి ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురవ్వలేదన్నారు. ప్రయాణికులను దుబాయి తీసుకెళ్లేందుకు కరాచీ ఎయిర్‌పోర్టుకు మరో విమానాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

ఇటీవల స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం దిల్లీ నుంచి  మధ్యప్రదేశ్ బయల్దేరిన ఓ స్పైస్‌జెట్‌ విమానం క్యాబిన్‌లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే తిరిగి దిల్లీ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. గత నెల 19న దిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లోనూ మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు. వరుస ఘటనలతో స్పైస్‌జెట్‌ ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని