Third Wave: మూడో వేవ్‌కు ఇదే సంకేతమా?

కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలన్నీ కఠిన ఆంక్షల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయి. అయితే, మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని.. అందరూ నిబంధనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశాయి.....

Updated : 13 Jul 2021 13:44 IST

ముంబయి: కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలన్నీ కఠిన ఆంక్షల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయి. అయితే, మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని.. అందరూ నిబంధనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశాయి. కానీ, ప్రజలకు అవేవీ పట్టనట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ జనసమూహ కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో వేవ్‌ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత రెండు వేవ్‌ల ప్రారంభం తొలి నాళ్లలో మహారాష్ట్ర, ముంబయిలో కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. తాజాగా మరోసారి మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఇదే మూడో వేవ్‌ ప్రారంభానికి సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జులై నెలలో తొలి 11 రోజుల్లో మహారాష్ట్రలో 88,130 కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. రెండో వేవ్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ తర్వాత మహారాష్ట్రలో రోజువారీ కేసులు గణనీయంగా తగ్గాయని.. జులైలో తిరిగి విజృంభిస్తున్నాయని ఫోర్టిస్‌ హీరానందని ఆసుపత్రిలో ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరోసారి భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయని పలువురు అధికారులు తెలిపారు. కొల్హాపూర్‌ జిల్లాలో రోజుకి దాదాపు 3000 కేసులు పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే, ముంబయిలో మాత్రం ఇప్పటికీ రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. గత మూడు రోజుల్లో సగటున రోజుకి దాదాపు 600 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో గత రెండు వేవ్‌లకు ముందు నెలకొన్న పరిస్థితులే ఇప్పుడూ పునరావృతమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యం, ప్రభుత్వం, పాలనా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై మహమ్మారి వ్యాప్తి అదుపునకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

కొవిడ్‌-19 మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న భారీ జనసమూహ కార్యక్రమాల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు నిశ్చింతగా ఉండడంపై భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) సోమవారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలు కొవిడ్‌ మూడో దశకు దారితీసి విస్తృత వ్యాప్తి కారకాలు కావొచ్చని స్పష్టంచేసింది. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాల సందర్శనలు, మతపరమైన కార్యక్రమాలు వంటివి అవసరమేనని, అదే సమయంలో కరోనా నేపథ్యంలో కొద్ది నెలలు ఆగడం మంచిదని స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గత అనుభవాలు, చరిత్రను పరిశీలిస్తే కొవిడ్‌-19 మూడో దశ తథ్యమని వెల్లడించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు