Sputnik V: భారత్‌లో పంపిణీకి ఆలస్యం ఎందుకంటే?

రెండో డోసు దిగుమతి కాస్త ఆలస్యం అవుతున్నందున.. అవి భారత్‌కు చేరిన తర్వాతే స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

Updated : 12 Jul 2021 20:41 IST

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి టీకా వినియోగానికి భారత్‌లో అనుమతి పొందింది. అయినా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. ఇందుకు గల కారణాలను భారత్‌లో ఆ టీకాను తయారీ, సరఫరా చేస్తోన్న డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. రెండో డోసు దిగుమతి కాస్త ఆలస్యమవుతున్నందున.. అవి భారత్‌కు చేరిన తర్వాతే స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ రెండు డోసులు వేర్వేరు ఫార్ములా కలిగి ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

రెండు డోసులు వేర్వేరు ఫార్ములాతో..

ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లలో ఎక్కువగా మొదటి, రెండు డోసులు ఒకే విధమైన ఫార్ములాను కలిగి ఉన్నాయి. అందుకే సెకండ్‌ డోసు ఇచ్చేందుకు ఎటువంటి ఆటంకం కలగడం లేదు. కానీ, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌లో మాత్రం రెండు డోసుల్లో వేర్వేరు రకాల (rAd26, rAd5) అడినోవైరస్‌ వెక్టార్లను వినియోగించారు. దీంతో మొదటి డోసు ఇచ్చిన వారికి రెండో డోసులో వేరే ఫార్ములా కలిగిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు డోసులు సరైన పరిమాణంలో ఉన్నప్పుడే ఎలాంటి ఆటంకం లేకుండా పంపిణీ చేయడం సులభమవుతుంది.

సరఫరా సజావుగా సాగేందుకే..

భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా తయారీ, సరఫరాకు డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థతో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి వీటి తయారీ ఇక్కడ ప్రారంభం కానందున.. కొన్ని డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తొలి విడతలో భాగంగా జూన్1న 30లక్షల డోసులు భారత్‌కు చేరుకోగా, జులైలో 3లక్షల 60వేల డోసులు వచ్చాయి. వీటిలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే లక్షా 95వేల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌ దేశవ్యాప్తంగా పంపిణీ చేసింది. వీటికి సంబంధించిన రెండో డోసును 21రోజుల వ్యవధిలోనే ఇవ్వాల్సి ఉంది. అందుచేత రెండో డోసు పరిమాణం దిగుమతి చేసుకునే వరకు పూర్తి స్థాయిలో స్పుత్నిక్‌-వి పంపిణీ చేపట్టలేమని డాక్టర్‌ రెడ్డీస్‌ అభిప్రాయపడింది. రెండో డోసు దిగుమతి ఆలస్యమైతే మొదటి డోసు వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

వారికి ఒక డోసు చాలు

కరోనా నుంచి కోలుకున్న వారికి ‘స్పుత్నిక్‌-వి’ టీకా తొలి డోస్‌ సరిపోతుందని తేలింది. వైరస్‌పై 94 శాతం మేర సమర్థంగా ఇది పని చేస్తోందని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. సైన్స్‌ డెరెక్ట్‌ జర్నల్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం నిరూపితమైంది. వైరస్‌ నుంచి కోలుకున్నవారిపై అర్జెంటీనాలోని ఆరోగ్య కార్యకర్తలకు స్పుత్నిక్‌-వి టీకా వేసుకున్న 21 రోజులకే.. శరీరంలో యాండీబాడీలు పెరిగి 94 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. 
గతంలో హైదరాబాద్‌కి చెందిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు సైతం కోలుకున్న వారికి సింగిల్‌ డోసు సరిపోతుందని వెల్లండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని