Sputnik-V: సీరంలో సుత్నిక్‌-వి తయారీ!

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ టీకా తయారీ సంస్థ ‘సీరం ఇన్‌స్టి్ట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)’కు అనుమతి లభించింది....

Published : 13 Jul 2021 20:05 IST

దిల్లీ: రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ టీకా తయారీ సంస్థ ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)’కు అనుమతి లభించింది. సెప్టెంబరు నుంచి పుణెలోని సంస్థ తయారీ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం. స్పుత్నిక్‌ టీకాను రూపొందించిన రష్యన్‌ ‘డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)’ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. ఏటా 300 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సీరం ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సీరం సీఈఓ అదర్‌ పూనావాలా సైతం ధ్రువీకరించారు.

కరోనా వైరస్‌పై పోరాడటంలో మెరుగైన సామర్థ్యం, భద్రత కనబరిచిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పూనావాలా అభిప్రాయపడ్డారు. మహమ్మారిలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో ప్రభుత్వాలు, సంస్థలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే రష్యాలోని గమలేయా సంస్థ.. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు కావాల్సిన సాంకేతికతను బదిలీ చేయడం ప్రారంభించిందని ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులందరికీ టీకా అందజేస్తామని ప్రభుత్వం ఇటీవల ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి టీకా ఉత్పత్తి ఇంకా భారీ ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సీరం నుంచి మరిన్ని టీకాలు అందుబాటులోకి రానుండడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని