Published : 31 Aug 2020 17:18 IST

పిల్లితో గూఢచర్యం: విఫలయత్నం.. కోట్లు ఖర్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూఢచర్యం ఎంతో సాహసోపేతమైన పని. శత్రువులు ఉండే ప్రాంతానికి వెళ్లి వారి రహస్యాలను కనిపెట్టడం అంటే అంత సులువు కాదు. అందుకే మనుషులకు బదులు ఇతర ప్రత్యామ్నాయాలు ఆన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లులతో గూఢచర్యం చేయించాలని గతంలో యూఎస్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ)లో భాగమైన డైరెక్టరేట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ భావించింది. ఇందుకోసం రూ. కోట్లు ఖర్చు చేసింది. అయినా వారి ప్రయత్నం విఫలం కావడంతో.. పిల్లులతో పనిచేయించుకోవడం కష్టమని అధికారులు ఆ ప్రాజెక్టును నిలిపివేశారు. 

1960లో సీఐఏలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ‘ఎకస్టిక్‌ కిట్టీ’ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టింది. వాషింగ్టన్‌ డీసీలోని అప్పటి సోవియేట్‌ ఎంబసీ, మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనంలో పిల్లుల సహాయంతో అక్కడి వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఒక పిల్లికి వైద్యులు శస్త్రచికిత్స చేసి దాని చెవుల వద్ద మైక్రోఫోన్‌, తలలో రేడియో ట్రాన్స్‌మీటర్‌, వెన్నెముకకు ఓ వైర్‌ అమర్చారు. తొలి ప్రయత్నంగా వాషింగ్టన్‌ డీసీలోని సోవియేట్‌ ఎంబసీ ప్రాంగణంలో ఇద్దరు అధికారులు మాట్లాడుకుంటున్న మాటలు వినాలని.. ఆ పిల్లిని పార్క్‌ వద్ద వదిలేశారు. సాధారణంగా పిల్లులు మన మాట వినవు. చాలా తొందరగా ప్రవర్తనను మార్చేసుకుంటాయి. సీఐఏ వదిలిన పిల్లి కూడా సహజంగానే చేయాల్సిన పనిని వదిలేసి రోడ్డుపైకి పరుగెత్తడంతో ఓ ట్యాక్సీ కింద పడి మృతి చెందింది. ఈ ప్రాజెక్టు కోసం సీఐఏ అప్పట్లోనే 20 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.150 కోట్లు ) ఖర్చు చేసిందట. ఆ తర్వాత పలు పిల్లులకు శిక్షణ ఇచ్చి చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో ప్రాజెక్టును 1967లో నిలిపివేయగా.. 2001లో పూర్తిగా మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించారు. 

1967లో ప్రాజెక్టును మూసివేస్తున్నప్పుడు సీఐఏ పరిశోధకులు ఓ వివరణ ఇచ్చారు. ‘‘పిల్లులతో తక్కువ దూరంలో పనిచేయించుకోగలమని నమ్ముతున్నాం. కానీ విదేశాల్లో పిల్లులతో గూఢచర్యం అంత ఆచరణయోగ్యం కాదు’’అని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణాన్ని సీఐఏలో పనిచేసిన ఉన్నతాధికారి రాబర్ట్‌ వాలెస్‌ 2013లో వెల్లడించారు. ‘‘పిల్లులు మనకు కావాల్సినట్లు ప్రవర్తించేలా శిక్షణ ఇవ్వడం, అలాగే పిల్లిలో అమర్చిన పరికరాలు తిరిగి తీసుకొని దాన్ని బతికించడం కష్టతరం’’అని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని