Manipur Violence: మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్‌ అధికారికి పిలుపు..

Manipur Violence: మణిపుర్‌లో అల్లర్లను కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని ఈశాన్య రాష్ట్రానికి బదిలీ చేసింది.

Published : 28 Sep 2023 11:49 IST

దిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి కల్లోల పరిస్థితులు (Manipur Violence) నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎస్‌ఎస్పీ రాకేశ్‌ బల్వాల్‌ (Rakesh Balwal)ను తన సొంత కేడర్‌ అయిన మణిపుర్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Home Minitsry) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పుల్వామా దాడిని దర్యాప్తు చేసిన రాకేశ్‌..!

రాజస్థాన్‌కు చెందిన రాకేశ్ బల్వాల్‌ (Rakesh Balwal) 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మణిపుర్‌ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018లో ఎన్‌ఐఏ (NIA)లో ఎస్పీగా పదోన్నతి పొందారు. 2019లో పుల్వామా (Pulwama Attack)లో జరిగిన భీకర ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ బృందంలో రాకేశ్ సభ్యుడిగా ఉన్నారు.

విద్యార్థుల హత్యతో మణిపుర్‌లో మళ్లీ అలజడి

ఆ తర్వాత 2021 డిసెంబరులో పదోన్నతిపై AGMUT (అరుణాచల్ ప్రదేశ్‌, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయ్యారు. శ్రీనగర్‌ సీనియర్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్నిరోజులుగా మణిపుర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కేడర్‌ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. తాజాగా దీనిపై ఉత్తర్వులు వెలువడ్డాయి. మణిపుర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని