SSB: మీ వ్యక్తిగత డేటాను ఫోన్‌లో ఉంచొద్దు: సైనికులకు SSB హెచ్చరిక

సరిహద్దు భధ్రతా బలగాల్లో కీలక విభాగమైన సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ) తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సిబ్బంది ఎవరూ తమ వ్యక్తిగత సమాచారాన్ని....

Updated : 21 Nov 2022 16:41 IST

దిల్లీ: సరిహద్దు భధ్రతా బలగాల్లో కీలక విభాగమైన సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ) తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సిబ్బంది ఎవరూ తమ వ్యక్తిగత సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌లలో భద్రపరచరాదని.. ఒకవేళ అది గుర్తుతెలియని వ్యక్తుల చేతికి చిక్కితే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించింది. అలాగే, అధికారిక ఉత్తర్వుల్ని వాట్సాప్‌లో షేర్‌ చేయడం, ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చర్చించడం, షేర్‌ చేసుకోవడం మానుకోవాలని సూచించింది. సున్నిత ప్రదేశానికి పోస్ట్‌ చేయబడిన ఓ అధికారి సైన్యం, కేంద్రబలగాల కదలికలను గుర్తుతెలియని సంస్థలకు వెల్లడించినట్టు సమాచారం అందడంతో దళాలకు తాజా సర్క్యులర్‌ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. 

‘‘మీ వ్యక్తిగత సమాచారం భద్రపరిచేందుకు మొబైల్‌ని వాడొద్దు. గుర్తుతెలియని వ్యక్తుల చేతికి చిక్కితే అత్యంత ప్రమాదకరం. ఫోన్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడింటిటీ) కోడ్‌ను రాసి సురక్షిత ప్రదేశంలో దాచుకోండి. తద్వారా అనధికార యాక్సిస్‌ను నిలువరించవచ్చు. ఒకవేళ ఫోన్‌ పోయినా, చోరీకి గురైనా బ్లాక్‌ చేసే వీలు ఉంటుంది. ట్రూకాలర్‌ యాప్‌ను తొలగించండి. అధికారిక ఉత్తర్వుల్ని వాట్సాప్‌ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకోవద్దు. భద్రతా దళాల కదలికలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లతో పాటు లొకేషన్లు, ఆయుధాలు, సున్నితమైన స్వభావంతో కూడిన వీటినీ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకోవద్దు. అలాగే, ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, సీయూజీ, వ్యక్తిగత మొబైల్‌ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌కు వెంటనే స్పందించొద్దు. అంతేకాకుండా.. ఉన్నతాధికారుల నుంచి క్లియిరెన్స్‌ పొందాకే వారు కోరిన సమాచారం అందిస్తామని సవినియంగా తెలియజేయండి. అలాగే.. ఉద్యోగులు, ఇతర అంతర్గత సమాచారాన్ని కోరే వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, సందర్శనలు, ఈమెయిల్‌ సందేశాలను అనుమానించండి. గుర్తు తెలియని వ్యక్తి చట్టబద్ధమైన సంస్థ నుంచి వచ్చినట్లు క్లెయిమ్‌ చేసే అతడు/ఆమె గుర్తింపును నేరుగా సదరు కంపెనీతో ధ్రువీకరించుకొనే ప్రయత్నించండి. సమాచారం కోరే కాలర్‌ నంబర్‌ని రాసుకొని వెంటనే ఉన్నత ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వండి ’’ అని సర్క్యులర్‌లో సూచించింది. సశస్త్ర సీమబల్‌ కింద పనిచేసే బలగాలు నేపాల్‌తో 1751 కి.మీలు, భూటాన్‌తో 699 కి.మీల మేర కంచెలేని భారత సరిహద్దుల్ని పరిరక్షిస్తున్న విషయం తెలిసిందే. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని