ISRO: SSLV తుది దశ సమాచార సేకరణలో స్వల్ప జాప్యం

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది...

Updated : 07 Aug 2022 13:51 IST

శ్రీహరికోట: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్ల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. టెర్మినల్‌ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం రాకెట్‌ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరుకున్నాయో.. లేదో.. విశ్లేషించి మిషన్‌ తుది ఫలితంపై త్వరలో సమాచారమిస్తామని తెలిపారు.

షార్‌ నుంచి ఆదివారం ఉదయం చిన్న ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో మొదటి, రెండు, మూడు దశలు.. శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా పూర్తయ్యాయి. ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన రాకెట్‌.. మోసుకెళ్లిన ఈఓఎస్‌-02, ఆజాదీ శాట్‌లను 13 నిమిషాల అనంతరం నింగిలో వదిలిపెట్టింది. వెలాసిటీ ట్రిమ్మింగ్‌ మాడ్యూల్‌ (వీటీఎం) నుంచి ఉపగ్రహాలు వేరయ్యాయి. అయితే.. ఇక్కడ మిషన్‌ టెర్మినల్‌ దశలో కొంత డేటా నష్టం జరిగింది. ఉపగ్రహాలకు సంబంధించి డేటా శాస్త్రవేత్తలకు లభించలేదు. ఇందు కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ డా.సోమనాథ్‌ మాట్లాడుతూ.. రాకెట్‌ మూడు దశలు బాగా పనిచేశాయనీ.. ఉపగ్రహాల నుంచి డేటా మిస్సయ్యిందనీ.. దాని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని వివరించారు.

ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. దీన్ని తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లే. దీని పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలదు. ఇది అంతరిక్ష రంగం, ప్రైవేటు భారతీయ పరిశ్రమల మధ్య మరింత సహకారాన్ని సృష్టించనుంది.

ఉపగ్రహాలు ఇవీ.. 

నేడు నింగిలోకి పంపిన ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. దీని జీవితకాలం ఆరు నెలలు. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను పొందుపర్చారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని