Tamil Nadu: సీఎం స్టాలిన్‌పై ఆరోపణలు.. భాజపా అధ్యక్షుడిపై పరువునష్టం కేసు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin)పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్‌ అన్నామలైపై (Annamalai) పరువునష్టం దావా దాఖలైంది.

Published : 10 May 2023 19:26 IST

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin)పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్‌ అన్నామలైపై న్యాయపరమైన చర్యలకు డీఎంకే ఉపక్రమించింది. ఇందులో భాగంగా అన్నామలై నిరాధార ఆరోపణలు చేశారంటూ స్థానిక సిటీ సివిల్‌ కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తరఫున సిటీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవరాజన్‌ ఈ కేసు వేశారు.

‘ఏప్రిల్‌ 14న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరువుకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు కొన్ని వీడియోలు కూడా ప్రదర్శించారు. అవన్నీ అవాస్తవాలే. కేవలం సీఎం స్టాలిన్‌ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో చేసినవే’ అని అన్నామలైకు వ్యతిరేకంగా వేసిన దావాలో పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై మాట్లాడిన డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఎలాంగోవన్‌.. అన్నామలైకు తగిన శిక్ష పడాలంటే ఇదే సరైన చర్య అన్నారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్‌ అన్నామలై క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ డీఎంకే ఇదివరకే లీగల్‌ నోటీసులు పంపింది. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌, దురై మురుగన్‌, ఈవీ వేలు, సెంథిల్‌ బాలాజీలతోపాటు పలువురు డీఎంకే నేతలు కూడా అన్నామలైకు నోటీసులు పంపించారు. అయితే, క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై.. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలకు తాను సిద్ధంగానే ఉన్నానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరువునష్టం దావా వేశారు.

ఇదిలాఉంటే, 2011లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో చెన్నై మెట్రో రైల్‌ కాంట్రాక్టు విషయంలో అవినీతి చోటుచేసుకుందని అన్నామలై ఆరోపిస్తున్నారు. ఆ చెల్లింపులు కూడా షెల్‌ కంపెనీల ద్వారా జరిగాయన్నారు. వీటితోపాటు డీఎంకే ముఖ్య నేతల ఆస్తులు.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికంటే భారీ స్థాయిలో పెరిగాయన్నారు. వీటికి సంబంధించి ‘డీఎంకే ఫైల్స్‌’ పేరుతో అన్నామలై విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని