The Elephant Whisperers: బొమ్మన్‌, బెల్లీలకు సీఎం స్టాలిన్‌ ఘన సన్మానం.. నగదు గిఫ్ట్‌.. ఇంకా..!

ఆస్కార్‌ అవార్డు సాధించిన ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్‌, బెల్లీ దంపతులను తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఘనంగా సన్మానించారు.

Published : 15 Mar 2023 15:36 IST

చెన్నై: దిక్కులేని ఏనుగులను (Elephants) చేరదీసి వాటి సంరక్షణను చూసే  బొమ్మన్‌, బెల్లి దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కిన భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు (Oscar 2023) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  ఇంత గొప్ప అవార్డు సాధించడంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ తమిళనాడు సీఎం స్టాలిన్‌(Stalin) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్‌, బెల్లీ దంపతులను కలిసి వారికి నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. నీలగిరి జిల్లాలోని మదుమలైలో ఏనుగులను తమ సొంత బిడ్డల్లా సాకుతూ ప్రశంసలు అందుకొంటున్న ఆ దంపతులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున నగదు చెక్కులను అందజేశారు. వారికి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించి గౌరవించినట్టు ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డాక్యుమెంటరీ తమిళనాడు అటవీ శాఖ పనితీరును, ఏనుగుల సంరక్షణకు చేస్తున్న ప్రయత్నాలను చూపించిందని పేర్కొన్నారు. 

తమిళనాడులోని మదుమలై, అన్నామలై ఏనుగు శిబిరాల్లో పనిచేస్తున్న 91మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున   సాయాన్ని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. అలాగే, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.9.10 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కోయంబత్తూరు జిల్లాలోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఏనుగుల శిబిరాన్ని రూ.5కోట్లతో అప్‌గ్రేడ్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు కోయంబత్తూరు జిల్లాలోని సవాడివాయల్‌లో అవసరమైన అన్ని సౌకర్యాలతో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

సీఎం సన్మానం అనంతరం బొమ్మన్‌ మీడియాతో మాట్లాడారు. ఏనుగుల పెంపకం అంత సులువేం కాదని.. పిల్లలపై చూపించిన శ్రద్ధే వీటిపట్ల కూడా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు, సీఎం స్టాలిన్‌ ఆ దంపతులను కలిసి సన్మానించడం పట్ల ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ కార్తికి గోంజాల్వెస్‌  హర్షం వ్యక్తంచేశారు.  'ది ఎలిఫెంట్ విస్పరర్స్' 95వ అకాడమీ అవార్డు గెలుచుకున్న తర్వాత సీఎం స్టాలిన్‌ బొమ్మన్‌, బెల్లీని సత్కరించినందుకు ఆనందంగా ఉందని.. తాను గర్వపడుతున్నానని పేర్కొంటూ ట్వీట్‌చేశారు.

తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) అనే లఘుచిత్రం రూపొందింది. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన ఈ దంపతులే ప్రధాన పాత్రలుగా ఈ కథ రూపుదిద్దుకుంది. నిర్మాత గునీత్‌ మోగ్న నేతృత్వంలో దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ ఈ కథను తెరకెక్కించారు. 42 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం ఆస్కార్‌ 2023లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని