CM Stalin: మక్కళ్‌ సీఎం.. సిటీ బస్సులో స్టాలిన్‌ ప్రయాణం!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాలనలో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ......

Updated : 07 May 2022 17:59 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాలనలో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజలకు చేరువైన ఆయన.. పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. తన ఏడాది పాలనలోనే ప్రజల ముఖ్యమంత్రి (మక్కళ్‌ సీఎం)గా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న స్టాలిన్‌.. శనివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంలో ఆయన ప్రభుత్వ మెట్రోపాలిటన్‌ రవాణా కార్పొరేషన్‌ (ఎంటీసీ) బస్సులో ప్రయాణించి  సాధారణ ప్రజలతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులతో మాట్లాడి తమ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి ఆరా తీశారు. చెన్నైలో రద్దీగా ఉండే రాధాకృష్ణన్‌ సలైలో 29 సి బస్సులో ప్రయాణించిన స్టాలిన్‌.. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు బస్సులో ప్రయాణం చేసిన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం

అలాగే, తమ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా మెరీనా తీరంలోని డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, తన తండ్రి ఎం.కరుణానిధి సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీలో కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు పౌష్టికాహారం ఇస్తామన్నారు.  ప్రజల వైద్య అవసరాలను తీర్చేలా అర్బన్‌ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా స్టాలిన్‌ గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని