Stalin: బుల్లెట్‌ రైలులో సీఎం స్టాలిన్‌.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!

Bullet Train: తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్శించడమే లక్ష్యంగా జపాన్‌ పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్‌ అక్కడి బుల్లెట్‌ రైలులో ప్రయాణించారు. ఈ మేరకు ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Published : 29 May 2023 01:28 IST

టోక్యో: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) జపాన్‌(Japan)లో పర్యటిస్తున్నారు.  తమిళనాడుకు భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన స్టాలిన్‌..  ఆదివారం బుల్లెట్‌ రైలు (Bullet Train)ఎక్కారు.  జపాన్‌లోని ఒసాకా నగరం నుంచి రాజధాని నగరం టోక్యో వరకు రైలులోనే ప్రయాణం చేసిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. వేగవంతమైన ఇలాంటి బుల్లెట్‌ రైలు సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేశా. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కి.మీల మేర ప్రయాణం సాగింది’’ అని పేర్కొంటూ తన జర్నీకి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

తమిళనాడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా స్టాలిన్‌ సింగపూర్, జపాన్‌ పర్యటనలకు బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేసిన ఆయన.. డిజైన్‌లోనే కాకుండా వేగం, నాణ్యతలోనూ బుల్లెట్‌ రైలుకు సమానమైన రైల్వే సేవలు మన దేశంలో రావాలన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షిస్తూ #futureindia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అలాగే, జపాన్‌లో ఉన్న తమిళులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమిళుల సంస్కృతిని చాటి చెప్పేలా అక్కడి చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని