MK Stalin: సీఆర్‌పీఎఫ్‌ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి..!

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షను ఇంగ్లిష్‌, హిందీనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

Updated : 09 Apr 2023 18:08 IST

దిల్లీ: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) ఉద్యోగ నియామక పరీక్ష కేవలం ఇంగ్లిష్‌, హిందీలో నిర్వహించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం లేకపోవడం వివక్ష, ఏకపక్షమని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

‘ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు కేవలం ఇంగ్లిష్‌, హిందీలోనే పరీక్ష రాయాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం లేకుండా పోతోంది. ఇది ఏకపక్షంగా ఉండటమే కాకుండా వివక్ష చూపించడమే’ అని అమిత్‌ షాకు రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు.

ఈ రకమైన పరీక్ష నిర్వహణతో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అవుతారని.. ఇది ఔత్సాహికుల రాజ్యాంగ హక్కుకు వ్యతిరేకమని ఎంకే స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని, తమిళంతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం 9212  కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు చివరి తేదీ ఏప్రిల్‌ 25. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు