New Jobs: 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: బిహార్‌ గవర్నర్‌

బిహార్‌లో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మొత్తంగా 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడమే నీతీశ్‌ కుమార్‌ సారథ్యంలోని ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకుందని గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ అన్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు.

Published : 27 Jan 2023 00:20 IST

పట్నా: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే సీఎం నీతీశ్‌ కుమార్‌(Nitish kumar) సారథ్యంలోని ప్రభుత్వ ప్రాధాన్యమని బిహార్‌ (Bihar) గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌(Phagu Chouhan) అన్నారు. ప్రభుత్వ రంగంలో పది లక్షల ఉద్యోగాలు(Jobs) కాగా.. ఇతర రంగాల్లో మరో పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. గురువారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల(Republic Day celebrations) సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. గత ఐదు నెలల వ్యవధిలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి యువతకు 28వేల ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఓ వైపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. మరోవైపు అవసరమైన చోట అదనపు ఉద్యోగాలను కూడా సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్న ఆయన.. మత సామరస్యతను కాపాడేందుకు కట్టుబడి ఉందన్నారు. పోలీసు బలగాల బలం కూడా పెరిగిందని.. చట్టవిరుద్ధ పనులకు పాల్పడుతున్న మాఫియాలపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. 

2020లో సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రవేశపెట్టిన విజన్‌ డాక్యుమెంట్‌ ‘సాత్‌ నిశ్చయ్‌ పార్ట్‌-2’లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయడం, ఇది వరకే ఉన్న సాంకేతిక సంస్థల్ని ఎక్స్‌లెన్సీ కేంద్రాలుగా మార్చడం, ఆరోగ్య, మౌలికవసతుల రంగాలను మెరుగుపరడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ప్రణాళికలు ప్రశంసనీయమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని