Chidambaram: దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. రీసెట్‌ చేయాలి..!

దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతోన్న

Updated : 14 May 2022 14:10 IST

చింతన్‌ శిబిర్‌లో కాంగ్రెస్‌ నేత చిదంబరం

ఉదయ్‌పూర్‌: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతోన్న కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధిరేటు అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ వివరాలను చిదంబరం నేడు మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధిరేటు మందగమనం ప్రస్తుత ప్రభుత్వ ‘హాల్‌మార్క్‌’గా మారిందని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఎన్నడూ ఊహించని స్థాయికి చేరిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు కూడా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణంగా చెప్పుకొచ్చారు. పేలవ విధానాలతో రూపొందించి 2017లో అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ పరిణామాలను ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు.

ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి విదేశీ వ్యవహారాలు కూడా ఓ కారణమని చిదంబరం చెప్పుకొచ్చారు. గడిచిన 7 నెలల్లో 22 బిలియన్ల అమెరికా డాలర్లు దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక విధానాలను రీసెట్‌ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘1991లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరళీకరణలో నూతన శకానికి నాంది పలికింది. దాని ద్వారా దేశం అపారమైన ప్రయోజనాలు పొందింది. సంపద సృష్టి, కొత్త వ్యాపార, వాణిజ్యాలు, లక్షలాది ఉద్యోగాలు, 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. ఇలా ఎన్నో ప్రయోజనాలు లభించాయి. అయితే 30 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న ప్రపంచ, దేశీయ పరిస్థితుల దృష్ట్యా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన అసవరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న అసమానతలు, ఆకలి, పేదరికం వంటి సమస్యలను పరిష్కరించేలా ఆ విధానాలు ఉండాలి’’ అని చిదంబరం చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నూతన ఆర్థిక విధానం తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ తీర్మానం రూపొందించినట్లు తెలిపారు. దీనికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉదయపూర్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ చింతన్‌ శిబిర్‌ మూడు రోజుల పాటు కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని