Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఇటీవల డెంగీ కేసులు (Dengue) విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్మూలన, నివారణ చర్యలను పటిష్ఠం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది.

Published : 27 Sep 2023 19:27 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు (Dengue) విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల (viral infection) కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన కేంద్ర ఆరోగ్యశాఖ.. డెంగీ నివారణ, నిర్మూలన చర్యలు పటిష్ఠం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 95వేల డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం.  91 డెంగీ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాల్లో డెంగీ కేసుల సంఖ్య భారీగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ దిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగీ నిర్మూలన, నియంత్రణతోపాటు నిర్వహణ చర్యలు పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ-మెయిల్‌ చూడని వైనం.. ‘బెయిల్‌’ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే!

అన్ని రాష్ట్రాలకు స్క్రీనింగ్‌ కిట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందించిందని, ఫాగింగ్‌తోపాటు ఐఈసీ కార్యకలాపాల కోసం ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పేర్కొంది. వీటితోపాటు ఆరోగ్య కార్యకర్తలకూ శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. డెంగీ నిర్మూలన, నిర్వహణలో భాగంగా పర్యవేక్షణ, కేసుల నిర్వహణ, ల్యాబ్‌ పరీక్షలు, యాంటీజెన్‌ టెస్టు కిట్ల సేకరణ వంటి తదితర కార్యక్రమ అమలు ప్రణాళిక (పీఐపీ) కింద రాష్ట్రాలకు తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని