‘మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ధరలు తగ్గించొచ్చు’

దిల్లీ: మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు చమురుపై పన్నులు తగ్గించినంత మాత్రన ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెద్దగా ప్రభావమేమీ పడబోదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆ మేరకు ఆయా ప్రభుత్వాలు వినియోగదారులపై భారం పడకుండా పన్నులు..

Published : 18 Mar 2021 01:16 IST

దిల్లీ: మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు చమురుపై పన్నులు తగ్గించినంత మాత్రన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెద్దగా ప్రభావమేమీ పడబోదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆ మేరకు ఆయా ప్రభుత్వాలు వినియోగదారులపై భారం పడకుండా పన్నులు తగ్గించవచ్చని సూచించారు. రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన్ మాట్లాడారు. ఇంధన ధరల పన్నులను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదో కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే విస్పష్టంగా సమాధానమిచ్చారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చని సూచించారు. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయడం లేదని, ముఖ్యంగా ముంబయిలో పన్నుల భారం ఎక్కువగా ఉందని చెప్పారు. అటువంటి చోట పన్నులను కొంతైనా తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పటికీ.. ఇంధన ధరల తగ్గింపు విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని శివసేన నేత అనిల్ దేశాయ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాన్ బదులిస్తూ.. వాజ్‌పేయీ హయాంలో ఇథనాల్‌ బ్లెండింగ్ (పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే పద్ధతి)ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాతి ప్రభుత్వ కాలంలో ఈ విధానాన్ని పక్కకు పెట్టారన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ దానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ వాటాను 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఆ మేరకు డిస్టిలరీ, నిల్వల సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని