భారత్‌లో 5.2 లక్షల కొవిడ్‌ మరణాలు.. ఆక్సిజన్‌ కొరతతో ఏ ఒక్కరూ చనిపోలేదు!

ఆక్సిజన్‌ కొరత దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 06 Apr 2022 02:12 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయం కారణంగా భారత్‌లో వేల సంఖ్యలో కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5లక్షల 21వేల మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్‌ అందక చాలామంది చనిపోయారనే వార్తలూ వినిపించాయి. వీటిపై స్పష్టతనిచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ.. ఇప్పటివరకు ఆక్సిజన్‌ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించలేదని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కొవిడ్‌ కేసులు, మరణాల వివరాలను పొందుపరుస్తున్నామని పేర్కొంది.

‘దేశంలో ఏప్రిల్‌ 4, 2022 నాటికి 5,21,358 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. కొవిడ్‌ కేసులు, మరణాల గణాంకాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల మరణించిన బాధితులు వివరాలను వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరాం. వీటిపై 20 రాష్ట్రాలు/యూటీలు స్పందించాయి. కానీ, ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల ఎవరూ మరణించలేదని ఆయా రాష్ట్రాలు వెల్లడించాయి’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు.

ఇక కొవిడ్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఎన్‌డీఎమ్‌ఏ సిఫార్సు మేరకు ప్రతి బాధిత కుటుంబానికి రూ.50వేల అందజేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని.. ఇప్పటివరకు 300లకు పైగా ల్యాబ్‌లు, ఐదు లక్షలకుపైగా ఆక్సిజన్‌తో కూడుకున్న పడకలు, 1.5లక్షల ఐసీయూ బెడ్‌లు, 4వేల పీఎస్‌ఏ ప్లాంట్లతో పాటు 60వేల వెంటిలేటర్లను అదనంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇక కొత్త వేరియంట్లు, వైరస్‌లను గుర్తించేందుకు గాను బయోసేఫ్టీ ల్యాబ్‌ లెవల్‌ (BSL)-3 త్వరలోనే అందుబాటులో రానుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని