Corona: ఆత్మసంతృప్తి వద్దు.. జాగ్రత్తగా ముందుకెళ్దాం

కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనించి, కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోన్న వేళ.. నిబంధనల విషయంలో సంతృప్తి పడొద్దని హెచ్చరించింది.

Updated : 23 Nov 2022 10:50 IST

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

దిల్లీ: కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనించి, కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోన్న వేళ.. నిబంధనల విషయంలో సంతృప్తి పడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. 

క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొవిడ్ ఆంక్షల విధింపు లేక సడలింపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ సూచించింది. ‘క్రియాశీల కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. కొవిడ్‌ ఉద్ధృతిని నిశితంగా గమనించి, కార్యకలాపాలను జాగ్రత్తగా పునఃప్రారంభించాలి. టెస్టింగ్, ట్రాకింగ్, వైద్యసేవలు, టీకాలు, నిరంతర నిఘా వంటి నియమాలను తప్పక పాటించాలి. దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించకుండా కొవిడ్ నియమావళిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి’ అని సూచించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపులు మార్కెట్లను రద్దీగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు తగ్గుతున్న వేళ.. సంతృప్తితో చతికిల పడకుండా చూసుకోవడం చాలా అవసరమని గుర్తుచేసింది. అలాగే కేసులు పెరుగుతూ, పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ సూచించిన కట్టడి చర్యలను అమలు చేయాలని పేర్కొంది. సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది.

రెండోదశలో ఉక్కిరిబిక్కిరి అయిన దిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. దాంతో మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ పెరిగింది. వేలాది మంది ఒకేదగ్గరికి చేరడమే కాకుండా, నిబంధనలను మరిచిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రవర్తనే మూడోదఫా విజృంభణను వేగవంతం చేస్తుందంటూ దిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని