Vaccination: కరోనా ముగిసిందని అనుకోవద్దు.. కేంద్రమంత్రి హెచ్చరిక!

మహమ్మారిపై పోరాటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో కలిసి పనిచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపునిచ్చారు. తద్వారా దేశంలో చివరి పౌరుడికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్‌...

Published : 11 Nov 2021 17:45 IST

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో కలిసి పనిచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపునిచ్చారు. తద్వారా దేశంలో చివరి పౌరుడికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్‌ అందజేసేందుకు చేపడుతున్న 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమంపై గురువారం మంత్రి.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనమంతా కరోనా ముగిసిందని భావించకూడదు. అప్రమత్తత అవసరం. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో 80 శాతానికి పైగా టీకాలు వేసినప్పటికీ.. వైరస్‌ విజృంభిస్తోంది’ అని గుర్తుచేశారు. టీకాలు అందించే క్రమంలో జిల్లాలవారీగా కార్యాచరణ రూపకల్పనకు కొవిన్‌ అప్లికేషన్‌ను వినియోగించాలని సూచించారు.

16 కోట్లకుపైగా డోసుల నిల్వలున్నాయి..

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79 శాతం మంది అర్హులకు మొదటి డోసు టీకా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ‘హర్ ఘర్‌ దస్తక్‌’లో భాగంగా అర్హులందరికీ మొదటి డోస్, 12 కోట్లకు పైగా జనాభాకు రెండో డోస్ పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఈ నెల 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 110.23 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 120.08 కోట్ల డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపింది. వాటి వద్ద ఇంకా 16.74 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయని, డ్రైవ్‌ను వేగవంతం చేయాలని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని