Gujarat Tragedy: కేబుల్‌ బ్రిడ్జి విషాదం.. టాప్‌ 10 పాయింట్లు..

గుజరాత్‌లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం తీగల వంతెన కుప్పకూలిన(Cable bridge collapse) ఘటన దేశంలో పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించగా..  మచ్చు నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Published : 02 Nov 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం తీగల వంతెన కుప్పకూలిన(Cable bridge collapse) ఘటన దేశంలో పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించగా.. మచ్చు నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కూలిన తీగల వంతెన(Cable bridge)ను పరిశీలించారు. అనంతరం సివిల్‌ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి అరెస్టయిన తొమ్మిది మందిలో నలుగురికి కోర్టు నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది.

  1. వంతెన కూలిన ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదేశించారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉంటూ వారికి అవసరమైన సాయం అందేలా చూడాలని ఆదేశించారు. మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం భూపేంద్ర పటేల్‌, హోమంత్రి హర్ష్‌ సంఘ్వి, మంత్రి బ్రిజేశ్‌ మెర్జా, సీఎస్‌, డీజీపీ, ఎస్పీ, ఐజీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
  2. కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటివరకు 135మంది మృతిచెందగా.. 170 మందిని కాపాడినట్టు గుజరాత్‌ మంత్రి రాజేంద్ర త్రివేది మంగళవారం వెల్లడించారు. మచ్చు నదిలో సాయుధ బలగాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌‌, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
  3. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.4లక్షల పరిహారం చెల్లించామని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.2లక్షల పరిహారం బాధిత కుటుంబాల ఖాతాల్లో తర్వలోనే డీబీటీ విధానంలో జమ అవుతాయని మంత్రి రాజేంద్ర త్రివేది గాంధీనగర్‌లో తెలిపారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో 17మంది ఇంకా గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
  4. ప్రధాని నరేంద్ర మోదీ మోర్బిలో పర్యటించారు. ఆదివారం సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో తెగిపడిన చారిత్రక తీగల వంతెనను పరిశీలించారు. నదిలో గల్లంతైనవారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ వంతెన ఎలా కూలిందన్న వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులతో మోదీ మాట్లాడారు. ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
  5. అనంతరం సివిల్‌ ఆస్పత్రికి చేరుకున్న మోదీ అక్కడే దాదాపు 15 నిమిషాల పాటు ఉన్నారు. ఆరుగురు క్షతగాత్రులతో మాట్లాడి వారికి ఆస్పత్రిలో అందుతోన్న వైద్యం గురించి ఆరా తీశారని గుజరాత్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి మనోజ్‌ అరగ్వాల్‌ మీడియాకు వెల్లడించారు. అక్కడి నుంచి మోర్బి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ప్రధాని.. స్థానిక అధికారులతో పాటు బాధితుల బంధువులను కలిసి మాట్లాడారు. అనంతరం అహ్మదాబాద్‌కు హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు.
  6. మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిల్‌పై నవంబరు 14న సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
  7. ఈ వంతెన కూలడం వెనుక మానవ తప్పిదాలతో పాటు నిర్వహణ లోపాలు కూడా బయటపడటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గుజరాత్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై జ్యుడిషియల్‌ దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
  8. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఘటనపై తీవ్రంగానే స్పందించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
  9. ప్రధాని సందర్శన నేపథ్యంలో మోర్బీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపాలను సరిచేయడం, మెరుగులు దిద్దడం వంటి చర్యలపై కాంగ్రెస్‌, ఆప్‌ తీవ్ర విమర్శలు చేయడంపై ఆస్పత్రి అధికారులు స్పందించారు. ఇది రొటీన్‌గా జరిగే పనేనని.. ఎక్కడైనా ఇది జరుగుతుంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రదీప్‌ దుద్రేజియా అన్నారు.
  10. మచ్చు నదిలో భారీ సంఖ్యలో సహాయక సిబ్బంది రంగంలోకి దించారు. 12 బోట్లతో 125 మందితో వెతికిస్తున్నట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని