Published : 03 May 2022 10:20 IST

Rajasthan: ఈద్‌ వేళ జోధ్‌పుర్‌లో అల్లర్లు.. ఇంటర్నెట్‌ నిలిపివేత

జోధ్‌పుర్‌: రంజాన్‌ పండగ వేళ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు.

ఈద్‌ను పురస్కరించుకుని జోధ్‌పుర్‌లోని జలోరీ గేట్‌ వద్ద జెండాలను ఏర్పాటు చేసే విషయంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

అనంతరం ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసు బందోబస్తు నడుమ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి కల్పించారు. మరోవైపు ఘర్షణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఇటీవల శ్రీరామనవమి, హనుమాన్‌జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈద్‌ వేళ భద్రతను పెంచాయి. మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చెలరేగిన ఖర్గోన్‌ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. అటు దిల్లీలోని జహంగీర్‌పుర్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని