Published : 29 Sep 2021 02:03 IST

Emmanuel Macron: యూరప్‌ దేశాలు అమాయకంగా ఉండటం మానేయాలి

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌

పారిస్‌: యూరప్‌ దేశాలు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం, సొంత సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకునే విషయంలో అమాయకంగా ఉండటం మానేయాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పిలుపునిచ్చారు. ‘మనపై ఇతర శక్తుల ఒత్తిడి ఉన్నప్పుడు మనం స్పందించాలి. మనకూ స్వీయ రక్షణ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని నిరూపించాలి’ అని అన్నారు. యుద్ధనౌకల కొనుగోలుకు సంబంధించి గ్రీస్ దేశం ఫ్రాన్స్‌తో మూడు బిలియన్‌ యూరోల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా మెక్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అణు జలంతార్గముల కొనుగోలు విషయంలో ఇటీవల ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కు మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ మధ్య కుదిరిన అణు జలాంతర్గాముల ఒప్పందంలో భాగంగా.. అమెరికా అభివృద్ధి చేసిన అణు జలాంతర్గాముల కొనుగోలుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ క్రమంలో గతంలో ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రాన్స్‌.. ఈ వ్యవహారాన్ని వెన్నుపోటు చర్యగా అభివర్ణించింది. ఈ వివాదంపై మెక్రాన్‌ తొలిసారి స్పందించడంతో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పరస్పర సహకారానికి కట్టుబడి ఉండాలి

ప్రస్తుత ఒప్పందంలో భాగంగా గ్రీస్‌.. ఫ్రాన్స్‌ నుంచి మూడు యుద్ధనౌకలను కొనుగోలు చేయనుంది. మరొకటి కూడా కొనుగోలు చేసే ఆప్షన్‌ పెట్టుకుంది. ఇరు దేశాల మధ్య విస్తృత వ్యూహాత్మక సైనిక, రక్షణ సహకార ఒప్పందంలో ఇది ఒక భాగం. గ్రీస్‌ ఇప్పటికే 24 రాఫెల్ యుద్ధ విమానాలకు ఆర్డర్ చేయడం గమనార్హం. దీంతో యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్న మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా నిలిచింది. తాజా ఒప్పందంపై గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌ మాట్లాడుతూ.. ఇది ఇరు దేశాల మధ్య దశాబ్దాల అనుబంధాన్ని నెలకొల్పుతుందన్నారు. సొంత ప్రయోజనాలు కాపాడుకోగల, బలమైన, స్వయం ప్రతిపత్తి గల రేపటి ఐరోపాకు ఇది తలుపులు తెరుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఒప్పందం తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందా అనే ప్రశ్నకు మెక్రాన్‌ స్పందిస్తూ.. ఈ ఒప్పందం ప్రత్యేకంగా ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కుదుర్చుకున్నది కాదని, గ్రీస్‌ రక్షణ కోసమేనని తెలిపారు. ‘యూరోపియన్లుగా సభ్యదేశాలకు సంఘీభావం తెలపడం మన కర్తవ్యం. ఆయుధ ప్రతిపత్తి సాధించడం చట్టబద్ధమే. ఈ క్రమంలో తోటి దేశాల సమగ్రతను గౌరవిస్తూ, చొరబాట్లు, దాడులు, ఆక్రమణల సమయాల్లో రక్షణ కోసం పరస్పర సహకారానికి కట్టుబడి ఉందామ’ని ఆయన కోరారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని