
Hamid Karzai: యుద్ధం ఆపండి.. చర్చలతో పరిష్కరించుకోండి!
కాబుల్: పంజ్‌షేర్ వ్యాలీ విషయంలో తాలిబన్లు, ఆ ప్రాంతం ప్రతిఘటన దళాల మధ్య ఘర్షణలతో నెలకొన్న పరిస్థితులపై అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఆందోళన వ్యక్తంచేశారు. తాలిబన్లు, పంజ్‌షేర్ ప్రతిఘటన దళాలు తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. తాలిబన్లు, పంజ్‌షేర్ నేతలు, గిరిజన తెగల మధ్య జరిగిన చర్చలు విఫలమైన మరుసటి రోజే ఆయన ట్విటర్‌లో స్పందించారు. ఉత్తర ప్రావిన్స్‌లో కొనసాగుతున్న ఈ యుద్ధంతో ఇప్పటికే హింస, రాజకీయ అస్థిరతతో కూనరిల్లుతున్న అఫ్గాన్‌కు గానీ, ఇక్కడి ప్రజలకు గానీ ఏమాత్రం మేలు జరగదన్నారు. యుద్ధంతో పరిష్కారం దొరకదని, అది కేవలం గాయాల నొప్పిని మాత్రమే మిగులుస్తుందని పేర్కొన్నారు. అఫ్గాన్ ప్రజలు సంపూర్ణమైన శాంతి, సంతోషాలను ఆస్వాదించేందుకు ఇరుపక్షాలూ ప్రస్తుత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్టు కర్జాయ్ ట్విటర్‌లో తెలిపారు.
మరోవైపు, ఆగస్టు 15న కాబుల్‌ను వశం చేసుకోవడంతో యావత్ అఫ్గానిస్థాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నప్పటికీ.. పంజ్‌షేర్‌లో మాత్రం తాలిబన్లు అడుగు పెట్టలేకపోయారు. అప్పట్లో గెరిల్లా పోరాటానికి కమాండర్‌గా ఉన్న అహ్మద్ షా మసూద్ తనయుడైన అహ్మద్ మసూద్ నాయకత్వంలో వేలాది మంది ప్రజలు దళాలుగా ఏర్పడి తాలిబన్ల చొరబాటు ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 350 మందికి పైగా తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టడంతో పాటు మరో 40మందిని పట్టుకొని ఖైదు చేసినట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాలిబన్లను దీటుగా ప్రతిఘటిస్తున్న పంజ్‌షేర్ దళాలు కేవలం తమ ప్రాంతాన్నే కాకుండా యావత్ దేశాన్ని తాలిబన్ల పాలన నుంచి రక్షిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పంజ్‌షేర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తాలిబన్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారు తమతో యుద్ధానికి వస్తే.. నరకానికి పంపిస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తున్న వేళ కర్జాయ్ ఇలాంటి సూచనలు చేయడం గమనార్హం.