Delhi: మరో వివాదం.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలు పాటించొద్దు: ఆప్‌ సర్కార్‌

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలను పాటించవద్దని దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం (APP Govt) అధికారులను ఆదేశించింది. ఎల్జీ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. సంబంధిత మంత్రులకు తెలియజేయాలని పేర్కొంది.

Published : 24 Feb 2023 23:18 IST

దిల్లీ: రాజధాని దిల్లీలో ఆప్‌(AAP) ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి మధ్య వివాదాలు సద్దుమణగకపోగా మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉపాధ్యాయులను శిక్షణ కోసం విదేశాలకు పంపించే అంశంపై తలెత్తిన వివాదం చల్లారకముందే.. ఎల్జీ విషయంలో ఆప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నుంచి నేరుగా వచ్చిన ఏ ఆదేశాన్నీ పాటించవద్దని అధికారులను కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆయన్నుంచి ఏ ఆదేశాలు వచ్చినా వాటిని సంబంధిత మంత్రులకు తెలియజేయాలని సూచించింది.  ఈ తాజా పరిణామం దిల్లీ సర్కార్‌, ఎల్జీ మధ్య మరో వివాదానికి తెర లేపినట్టయింది. 

ప్రభుత్వాన్ని సంప్రందించకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి నేరుగా ఎలాంటి ఆదేశాలు వచ్చినా అవి రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించినట్లే అవుతుందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా అన్నారు. అలాంటి ఆదేశాలను పాటించడం కూడా సుప్రీంకోర్టును ధిక్కరించినట్లే అవుతుందని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆప్‌ ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది. ఉపాధ్యాయుల అంశమే కాకుండా వివిధ సందర్భాల్లో ఆప్‌ ప్రభుత్వానికి, ఎల్జీకి మధ్య పొసగడం లేదు. ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి ఎల్జీ నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ చాలా సార్లు ఆప్‌ నేతలు ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.

‘‘ సేవల నియంత్రణపై కేంద్రం-ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. భారత రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవించాలని ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి నేరుగా వస్తున్న ఆదేశాలను అధికారులు అమలు చేయొద్దు’’ అని దిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై మంత్రులందరూ సంబంధిత శాఖల అధికారులకు ప్రత్యక్షంగా చెప్పాలని కోరింది.  2018 జులై 4న సుప్రీం కోర్టు విడుదల చేసిన మార్గదేశాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని