EC: ‘వాటిని ప్రచురించకుండా నిలువరించండి’

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతికి ఎన్నికల సంఘమే(ఈసీ) కారణమంటూ మద్రాస్‌ హైకోర్టు చేసిన పదునైన వ్యాఖ్యలపై మీడియా ప్రచురించి....

Updated : 30 Apr 2021 13:53 IST

* మౌఖిక వ్యాఖ్యల ప్రచురణకు అనుమతించొద్దు 

* మద్రాస్‌ హైకోర్టులో ఈసీ పిటిషన్‌

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతికి ఎన్నికల సంఘమే(ఈసీ) కారణమంటూ మద్రాస్‌ హైకోర్టు చేసిన పదునైన వ్యాఖ్యలపై మీడియా ప్రచురించిన కథనాలపై ఈసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కరోనా విజృంభణకు ఈసీయే ఏకైక కారణమన్నట్లుగా మీడయా వార్తల్ని ప్రచురించిందని వాపోయింది. ఈ నేపథ్యంలో కోర్టు చేసే మౌఖిక వ్యాఖ్యల్ని ప్రచురించకుండా మీడియా సంస్థల్ని నిలువరించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో ఈసీ పిటిషన్‌ వేసింది.

రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత కలిగిన స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం ప్రతిష్ఠ మీడియా కథనాల వల్ల దెబ్బతిందని పిటిషన్‌లో పేర్కొంది. మద్రాస్‌ హైకోర్టు ఘాటు మౌఖిక వ్యాఖ్యల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌పై హత్యాయత్నం కేసు కూడా నమోదైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రికార్డుల్లో నమోదుకాని కోర్టు పరిశీలనల్ని నివేదించడానికి ఎవరినీ అనుమతించొద్దని ఈసీ కోరింది. పైగా తమిళనాడులో ఏప్రిల్‌ 4నే ప్రచారం ముగిసిన నేపథ్యంలో కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇది సందర్భమూ కాదని వ్యాఖ్యానించింది.

మద్రాస్‌ హైకోర్టు ఏమందంటే...

అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఎన్నికల సంఘమే (ఈసీ) దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతికి కారణమని మద్రాస్‌ హైకోర్టు సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు ఆ సంస్థదే బాధ్యతని స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఎన్నికల ర్యాలీలు, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇవ్వడం.. దేశంలో మహమ్మారి రెండో దశ తీవ్రతకు కారణమైందని పేర్కొంది. ఆ సమయంలో అధికారులు వేరే గ్రహం మీద ఉన్నారా? అని ప్రశ్నించింది. తమిళనాడులోని కరూర్‌లో ఓట్ల లెక్కింపు సమయంలో కరోనా నిబంధనలు పాటించేలా ఆదేశించాలంటూ ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, కరూర్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి ఎం.ఆర్‌.విజయభాస్కర్‌ మద్రాస్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ, జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు