Geeta Mukherjee: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మార్గదర్శి గీతా ముఖర్జీ.. ఎవరామె?

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మూలకారణమైన గీతా ముఖర్జీ గురించి ప్రత్యేక కథనం..

Published : 21 Sep 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దేశ మహిళలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న బిల్లుకు మోక్షం కలిగే ప్రక్రియ చివరి దశకు చేరింది. తాజాగా ఇది లోక్‌సభలో ఆమోదం పొందడం.. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతివ్వడంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ క్రమంలో లోక్‌సభలో జరిగిన చర్చలో ఈ బిల్లుకు మూలకారణమైన గీతా ముఖర్జీ (Geeta Mukherjee) పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఎవరీ గీతా ముఖర్జీ అని ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే.. 

మహిళా బిల్లు.. భాజపాకు ‘రాజకీయ ఎజెండా’ కాదు!

  • మహిళా రిజర్వేషన్‌ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును సెప్టెంబర్‌ 12, 1996లో గీతా ముఖర్జీ తొలిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆమె.. బిల్లుపై సమగ్ర సమీక్ష జరిపి, ఏడు కీలక సిఫార్సులు చేశారు. పార్లమెంటు ముందుకు ఈ బిల్లు రావడం ఐదోసారి కావడం గమనార్హం.
  • కోల్‌కతాలో 1924లో జన్మించిన గీతా ముఖర్జీ.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. సీపీఐ నేత బిశ్వనాథ్‌ ముఖర్జీని ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం 1946లో బెంగాల్‌ స్టేట్‌ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి, కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అరెస్టయి ఆరునెలలపాటు జైల్లో ఉన్నారు.
  • 1967లో పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన ఆమె.. 1977 వరకు కొనసాగారు. 1980లో పన్స్కుర లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది.. తన చివరి శ్వాస వరకు (2000) అదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. సీపీఐ నేషనల్‌ కౌన్సిల్‌, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లోనూ సభ్యురాలిగా పనిచేశారు. వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్న ఆమె.. మహిళలకు సంబంధించిన అనేక కమిటీల్లో ఉన్నారు. సామాజిక న్యాయం, మహిళల హక్కుల కోసం పోరాటంలో తన బలమైన గళాన్ని వినిపించారు.
  • గీతా ముఖర్జీ బెంగాలీలో భారత్‌ ఉపకథ, చోటోదేర్‌ రవీంద్రనాథ్‌ (Children's Rabindranath), ‘నేక్‌డ్‌ ఎమాంగ్‌ వోల్వ్స్‌’ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు. 76 ఏళ్ల వయసులో గుండెపోటుతో గీతా ముఖర్జీ కన్నుమూశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకోసం ఎంతో పోరాడిన ఆమె.. ఆయా ప్రభుత్వాలు దాన్ని పార్లమెంటులో ఆమోదింపజేయడంలో విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదం పొందేందుకు చివరి వరకు తన ప్రయత్నాలను కొనసాగించారు.
  • తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడే బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌.. మహిళా రిజర్వేషన్లపై కొత్త బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
  • ఈ బిల్లు చట్టంగా మారితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే, ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని