కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్‌ లేదు కానీ..

దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే పది రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కమిటీలను పంపింది.

Published : 26 Feb 2021 14:21 IST

ఆంక్షలు కఠినం చేసిన మహారాష్ట్ర సర్కార్‌

ముంబయి: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే పది రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కమిటీలను పంపింది. మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువశాతం మహారాష్ట్ర, కేరళల నుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించట్లేదు కానీ ఆంక్షలను కఠినం చేస్తున్నట్లు మంత్రి విజయ్‌ వడ్డేతివార్‌ తెలిపారు. నాగ్‌పూర్‌లో శుక్రవారం మంత్రి కరోనా కట్టడి చర్యల గురించి వివరించారు. కరోనా కేసుల్లో పెరుగుదలకు ఒక కారణంగా భావిస్తున్న లోకల్‌ ట్రైన్ల సంఖ్యను తగ్గిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా బస్సుల్లో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించకుండా చూస్తామని తెలిపారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

గత రెండు రోజులుగా మహారాష్ట్రలో ఎనిమిదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ‘‘మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు ఎక్కువగా కరోనా ప్రభావానికి గురయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ హాట్‌స్పాట్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా ఆంక్షలను కఠినం చేస్తున్నాం. లాక్‌డౌన్‌ విధించం.. కానీ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటాం. లోకల్‌ ట్రైన్ల సంఖ్యను తగ్గించడం, ప్రజారవాణా‌ వాహనాల్లో తక్కువ మంది ప్రయాణించేలా చూడటం, మాల్స్‌ను మూసి ఉంచడం వంటివి చేస్తాం. ఫంక్షన్‌ హాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతాం ’’ అని మంత్రి తెలిపారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించడమా లేక తమిళనాడు తరహాలో విద్యార్థులను తర్వాతి తరగతులకు పంపడమా అన్న అంశంపై ప్రభుత్వం యోచిస్తోందని ఆయన వెల్లడించారు. కాగా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 8,702 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 21,298,21కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని