Delhi: ఆప్‌ ప్రభుత్వం వల్లే దిల్లీ విద్యార్థులు రాణిస్తున్నారు : ఎల్జీ ప్రశంసలు

విద్యా రంగంలో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కృషి వల్లే దిల్లీ విద్యార్థులు చదువులో బాగా రాణిస్తున్నారని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రశంసలు గుప్పించారు. విద్యతో పాటు వైద్య రంగంలోనూ సదుపాయాల మెరుగునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

Published : 17 Mar 2023 14:25 IST

దిల్లీ: దిల్లీ ప్రభుత్వం (AAP).. అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య పలు అంశాల్లో కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. విద్యా ప్రమాణాలు పెంచేందుకు శిక్షణ నిమిత్తం టీచర్లను విదేశాలకు పంపే అంశం మొదలు మేయర్‌ ఎన్నిక వంటి విషయాల్లోనూ ఆప్‌ ప్రభుత్వానికి, ఎల్జీకి (Lt Governor) మధ్య వివాదం కొనసాగింది. ఈ క్రమంలో తమను ప్రశ్నించడానికి అసలు ఎల్జీ ఎవరంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విద్యారంగాన్ని మెరుగుపరచడంపై ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్లే దిల్లీ విద్యార్థులు చదువులో రాణిస్తున్నారని ప్రశంసించారు.

దిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. దిల్లీలో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాత వాటిని ఆధునీకరిస్తుండడంతోపాటు కొత్త ఆస్పత్రుల ద్వారా 16వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇలా వైద్య, విద్యా రంగాలను మరింత మార్పులు తెచ్చేందుకు  దిల్లీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇదిలాఉంటే దిల్లీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యశాఖ మంత్రులుగా ఉన్న మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌లు వివిధ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వీరు ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేశారు. వారిస్థానంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా ఆతిశీ, ఆరోగ్యశాఖ మంత్రిగా సౌరభ్‌ భరద్వాజ్‌ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆతిశీ విద్యతోపాటు పీడబ్ల్యూడీ, విద్యుత్తు, పర్యాటకశాఖలను నిర్వహిస్తుండగా.. సౌరభ్‌ ఆరోగ్యంతోపాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమలశాఖలను చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని