Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్‌ కూల్చివేత.. ఎందుకంటే..?

Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద మృతదేహాలను భద్రపర్చేందుకు స్థానికంగా ఉన్న ఓ హైస్కూల్‌ను తాత్కాలిక మార్చురీగా మార్చారు. అయితే ఇప్పుడు ఆ పాఠశాలను కూల్చివేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే?

Published : 09 Jun 2023 13:39 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం (Odisha Train Tragedy) బాలేశ్వర్‌ ప్రజలకు ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన వార్తలు వింటేనే వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బహానగా ప్రభుత్వ పాఠశాల (Bahanaga High School)లో భద్రపర్చారు. దీంతో ఇప్పుడు ఆ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ పాఠశాల భవనాన్ని తాజాగా కూల్చేశారు.

జూన్‌ 2వ తేదీన బాలేశ్వర్‌ (Balasore)లోని బహానగా రైల్వే స్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే బహానగా వాసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 288 మంది దుర్మరణం చెందగా.. ఈ మృతదేహాలను తొలుత బహానగా హైస్కూల్‌కు తరలించారు. ఈ పాఠశాలను తాత్కలిక శవాగారంగా మార్చారు. అనంతరం మృతదేహాలను ఇక్కడి నుంచి భువనేశ్వర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్కూల్‌ను శుభ్రం చేశారు. (Odisha Train Accident)

అయితే అనేక మృతదేహాలను ఒకే చోట చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఈ ప్రదేశానికి వచ్చేందుకు జంకుతున్నారు. ఈ స్కూల్‌ను జూన్‌ 16న తిరిగి తెరవనున్నారు. అయితే, పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ధైర్యం చేయట్లేదని, వారి తల్లిదండ్రులు చిన్నారులను పంపించేందుకు నిరాకరిస్తున్నారని స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్‌ తెలిపారు. మరోవైపు, 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం కూడా దెబ్బతిందని ఆమె అన్నారు. దీంతో ఈ స్కూల్ భవనాన్ని కూల్చాలని పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ నేపథ్యంలోనే బాలాసోర్‌ జిల్లా కలెక్టర్‌ దత్తాత్రేయ శిందే గురువారం స్కూల్‌కు వెళ్లి పరిశీలించారు. అనంతరం కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ భవనాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ ప్రదేశంలోనే మరో కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అప్పుడు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా వస్తారని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు