Subhas Chandra Bose: నేతాజీకి జాతి ఘన నివాళులు.. గణతంత్ర దినోత్సవాలకు నేడు శ్రీకారం

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా భారతదేశం నేతాజీకి కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. స్వతంత్ర...

Updated : 25 Jan 2024 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా భారతదేశం నేతాజీకి కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు.. బోస్‌ను ‘నేషనల్‌ ఐకాన్‌’గా నిలిపాయని, ఆయన ఆశయాలు, త్యాగాలు దేశవాసులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని ట్వీట్‌ చేశారు.

గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. ఏ దేశమైనా.. తన పౌరుల కృషి, పరాక్రమంతోనే బలంగా తయారవుతుందని, ఏళ్లుగా భారతీయుల్లో నిద్రాణమై ఉన్న శక్తిని జాతీయవాదం మేల్కొల్పిందని అభివర్ణించారు. బోస్‌ అసమాన ధైర్యం, నిస్వార్థ దేశ సేవను స్మరించుకుంటూ ఆయన జయంతిని పరాక్రమ్‌ దివస్‌గా జరుపుకొంటున్నట్లు గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సుభాష్ చంద్రబోస్‌కు నమస్కరిస్తున్నా. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు’ అని ట్వీట్‌ చేశారు.

సుభాష్ చంద్రబోస్ జయంతినీ చేర్చుతూ.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను జనవరి 24కి బదులుగా 23 నుంచే ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం దిల్లీలోని ఇండియా గేట్ వద్ద బోస్‌ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ‘సుభాష్‌ చంద్ర‌బోస్ ఆప‌ద ప్రబంధ‌న్’ అవార్డుల‌నూ ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి బోస్‌ జయంతిని ‘పరాక్రమ్‌ దివస్‌’గా నిర్వహిస్తోంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని