అంచనాలు లేని స్థాయి నుంచి అంతా తానై

అప్రతిహత విజయాలకు చిరునామా ఇస్రో. చేపట్టిన ప్రతి ప్రయోగాన్ని విజయపథంలో నడిపిస్తూ దిగ్గజ దేశాల సరసన నిలిచింది. ప్రపంచదేశాల చూపు తనవైపు తిప్పుకుంది...

Updated : 09 Jan 2021 22:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అప్రతిహత విజయాలకు చిరునామా ఇస్రో. చేపట్టిన ప్రతి ప్రయోగాన్ని విజయపథంలో నడిపిస్తూ దిగ్గజ దేశాల సరసన నిలిచింది. ప్రపంచదేశాల చూపు తనవైపు తిప్పుకుంది. ఒకప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా... సాధారణంగా మొదలైన ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..ఇప్పుడు విశ్వసనీయమైన PSLV వాహకనౌకతో చరిత్రలో నిలిచిపోయే విజయాలు సాధించింది.. సాధిస్తూనే ఉంది. ప్రపంచదేశాలన్నీ కరోనా కోరల్లో చిక్కుకొని..ప్రయోగాల విషయంలో అవస్థలు పడుతుంటే..ఇస్రో ఆశల అస్త్రం పీఎస్‌ఎల్‌వీ మాత్రం లక్ష్యాల వైపు విరామం లేకుండా పరుగులు తీస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త తీరాలను చేరుకుంటూ దేశ సాంకేతిక ప్రగతిలో భాగమవుతోంది. సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతూ రాకెట్ వేగానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది. 

నమ్మిన బంటు

డిసెంబర్‌ 17 2020....! భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు మరిచిపోలేని ప్రత్యేక విజయాన్ని అందించిన రోజు. ఇప్పటికే ఎన్నో విజయాల్ని ఖాతాలో వేసుకున్న ఇస్రో...పీఎస్‌ఎల్‌వీ సి-50 ఉపగ్రహ ప్రయోగం లక్ష్యం చేరుకోవటంతో మరో గెలుపు నమోదు చేసింది. శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి డిసెంబర్‌ 17న ప్రయోగించిన సీఎంఎస్‌-01 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో నమ్మిన బంటు పీఎస్‌ఎల్వీ వాహక నౌక.. కౌంట్‌డౌన్‌ అనంతరం నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి తీసుకెళ్లింది. 22 నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఇస్రో అమ్ములపొదిలో రామబాణం వంటి PSLV-సీ50 అర్ధశతక విజయాన్ని సగర్వంగా సొంతం చేసుకుంది. 

సరికొత్త చరిత్రకు శ్రీకారం

గతేడాది ఇస్రోకు 2వ విజయం అందించిన PSLV సి-50 ఉపగ్రహ వాహక నౌక డిసెంబర్‌ 17 గురువారం సాయంత్రం 3.41 గంటలకు 320 టన్నుల బరువుతో భూమి నుంచి లక్ష్యం దిశగా దూసుకుపోయింది. భూమికి 35,975 కి.మీ ఎత్తులో ఉన్న జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోని దీర్ఘ వృత్తాకార కక్ష్యలో 1,410 కిలోలు బరువున్న సీఎంఎస్-01 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ వాహననౌకల విజయ పరంపరను కొనసాగించింది. ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్‌ఎల్‌వీ.. 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయ బావుటా ఎగురవేసింది. ఆ రోజు  ప్రత్యేకం ఏమిటంటే... పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు చేపట్టగా...50 ప్రయోగాలు సఫలమై...సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి.

11 ఏళ్ల కిందట పంపిన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-12 జీవిత కాలం ముగియడంతో దాని స్థానంలో సీఎంఎస్‌-01 ఉపగ్రహన్ని పీఎస్‌ఎల్‌వీ సీ-50 ద్వారా అంతరిక్షంలోకి పంపారు. సీఎంఎస్-01 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్‌ సేవలను ఏడేళ్ల పాటు అందించనుంది. దీని పరిమితి దేశంలోని అన్ని ప్రధాన భూభాగాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌ల వరకూ విస్తరించి ఉంది. ఇప్పటివరకూ 41 సమాచార ఉపగ్రహలు అంతరిక్షంలోకి పంపగా.. సీఎంఎస్‌-01 భారతదేశపు 42వ కమ్యునికేషన్‌ ఉపగ్రహం. కొవిడ్‌-19 వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతమైన పనితీరు చూపి విజయంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అభినందించారు. మరిన్ని విజయాలకు నాంది పలకాలని సూచించారు.

1993లో తొలిసారి..

పీఎస్‌ఎల్‌వీ వాహననౌక విషయానికి వస్తే... 1993, సెప్టెంబరు 20న షార్‌ నుంచి తొలిసారి గగనయాత్ర ప్రారంభించింది. ఈ రాకెట్‌ డిసెంబర్ 17న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ50తో కలిపి 52 సార్లు రోదసిలోకి పయనించింది. వీటిలో 1993లో తొలి రాకెట్‌ పీఎస్‌ఎల్వీ-డీ1, 2017లో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ39 రాకెట్లు మాత్రమే లక్ష్యం చేరుకోలేకపోయాయి. మిగిలిన 50 పీఎస్‌ఎల్వీలు విజయవంతంగా గమ్యాన్ని చేరుకుని...అంతర్జాతీయ పరిశోధన రంగంలో ఇస్రో ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. అయితే ఇస్రో...పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంది. తొలుత PSLV-జీ.. జనరిక్‌ పేరిట రూపొందించింది. ఆ తరువాత PSLV-సీఎ.. కోర్‌అలోన్‌ను తయారుచేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో  PSLV-ఎక్స్‌ఎల్‌, PSLV-డిఎల్‌, PSLV-క్యూఎల్‌ రాకెట్లుగా అభివృద్ధి చేసింది.

ఇతర దేశాలకు ప్రత్యామ్నాయంగా..

ఇస్రో తన ప్రయోగాల్లో భాగంగా ఇప్పటివరకూ 12 PSLV-జీ, 14 PSLV-సీఎ, 22 PSLV-ఎక్స్‌ఎల్‌,  రెండు PSLV-డీఎల్‌,  రెండు PSLV-క్యూఎల్‌ రాకెట్లు ప్రయోగించింది. వీటిలో ఒక PSLV-జీ,  ఒక PSLV-ఎక్స్‌ఎల్‌ రాకెట్లు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమయ్యాయి. పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా ఇస్రో ఇప్పటికి దాదాపుగా 439 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేయడం ఈ వాహకనౌక సామర్థ్యాన్ని తెలుపుతోంది. అందులో 111 స్వదేశీ ఉపగ్రహాలు ఉండగా, 328 విదేశీ ఉపగ్రహాలున్నాయి. ఈ సంఖ్య PSLVపై ఇస్రోతో పాటు ఇతర దేశాలకు ఉన్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకే PSLV రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో.. పీఎస్‌ఎల్వీ సత్తాను ప్రపంచానికి గర్వంగా చాటింది.

PSLVసీ37 ద్వారా వివిధ దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలు ఏకకాలంలో నింగిలోకి పంపిన ఇస్రో...తక్కువఖర్చుతో ఉపగ్రహ ప్రయోగాలకు ఇతరదేశాలకు ప్రత్యామ్నాయంగా  మారింది. అంతరిక్ష పరిశోధనలో భారత కీర్తిప్రతిష్ఠలు రోదసిలోకి మోసుకెళ్లడంలో PSLV పాత్ర తిరుగు లేనిది. భారత్‌కు విదేశీ మారకద్రవ్యం రాబట్టడంలోనూ ఇస్రోకు ఎంతోగానో ఉపయోగపడుతోంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-1, మంగళయాన్‌, ఆస్ట్రోశాట్‌ వంటి కీలక ప్రయోగాల కు సైతం PSLVనే వాహకనౌకగా ఎంచుకోవటం విశేషం. ఈ రాకెట్‌ తయారీకి 130 కోట్ల రూపాయల ఖర్చు అవుతుండగా.. అంతకు ఎన్నో రెట్ల ఆదాయం దేశానికి ఈ రాకెట్‌ అందిస్తోంది. ఇస్రోకు అటు పేరు ప్రఖ్యాతుల్ని పెంచటంలో, ఇటు విదేశాల నమ్మకం చూరగొనటంలో తనదైన ప్రత్యేకత నిలబె ట్టుకుంటున్న PSLV ద్వారా మరిన్ని అద్భుత ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. 

 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు