Sudan: వెనక్కితగ్గిన సూడాన్‌ సైన్యం.. ప్రధాని విడుదల

సూడాన్‌ సైన్యం నిర్బంధించిన ఆ దేశ ప్రధాని హామ్‌డోక్‌తోపాటు ఆయన భార్య మునా అబ్దుల్లాను సైన్యం విడుదల చేసినట్లు సమాచారం. భారీ భద్రత నడుమ ప్రధానమంత్రి సహా......

Published : 27 Oct 2021 22:54 IST

ఖార్టూమ్‌: సైన్యం తిరుగుబాటుతో ఆఫ్రికా దేశం సూడాన్‌ అట్టుడుకుతోంది. ప్రధానమంత్రి అబ్దుల్లా హామ్​డోక్‌ సహా పలువురు కీలక నేతలను సైన్యం నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత, నిధుల నిలిపివేత హెచ్చరికలతో సైన్యం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నిర్బంధించిన ప్రధాని హామ్‌డోక్‌తోపాటు ఆయన భార్య మునా అబ్దుల్లాను సైన్యం విడుదల చేసినట్లు సమాచారం. భారీ భద్రత నడుమ ప్రధానమంత్రి సహా ఆయన భార్య రాజధాని ఖార్టూమ్‌లోని అధికార నివాసానికి చేరుకున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అయితే ఇతర అధికారులు మాత్రం సైన్యం గుప్పిట్లోనే ఉన్నట్లు తెలిపింది.

సూడాన్‌లో ప్రజాస్వామ్య పాలనకు చరమగీతం పాడుతూ ప్రభుత్వంపై అక్కడి సైన్యం సోమవారం తిరుగుబాటు చేసింది. సైన్యాధికారి జనరల్ అబ్దెల్ ఫటా బుర్హాన్ నేతృత్వంలో ప్రధాని సహా ప్రభుత్వ అధికారులందరినీ అరెస్టు చేసింది. అయితే ఈ వ్యవహారంపై అంతర్జాతీయస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఐరాస, ఐరోపా, అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. సుడాన్​కు అమెరికా అందిస్తున్న 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు బైడెన్ యంత్రాంగం ప్రకటించింది. ప్రభుత్వ అధికారులందరినీ విడిచిపెట్టాలని స్పష్టం చేసింది. యురోపియన్‌ యూనియన్‌ సైతం ఈ తరహా ప్రకటనే చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌ సైతం సూడాన్‌ సైనిక చర్యను ఖండించారు. ప్రధానిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఆగని నిరసనలు.. ఆందోళనకారుల కాల్చివేత

అయితే, విడుదల అనంతరం కూడా ప్రధాని అబ్దుల్లా గృహనిర్బంధం లాంటి వాతావరణంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లా నివాసం ఉన్న ఖర్తోమ్ పరిసరాల్లో భారీగా సైనికులు పహారా కాస్తున్నారు. మరోవైపు, సూడాన్​లో నిరసనలు ఆగడం లేదు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖార్టూమ్, ఓమ్‌దుర్మాన్‌ నగరంలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు మృతిచెందారు. మరో 140 మంది గాయపడినట్లు అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని