Sudha Murty: 30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు

Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Published : 05 Jul 2024 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రచయిత్రి, వితరణశీలిగా సుపరిచితురాలైన సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభ ఎంపీగా కొత్త బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఇటీవల పెద్దల సభలో ఆమె చేసిన తొలి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై గళం వినిపించిన ఆమెకు స్వయంగా ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ సుధామూర్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా కన్పిస్తారు. ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య అయిన ఆమె.. గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనలేదంటే మీరు నమ్ముతారా? అదే నిజమంటున్నారామె..! అందుకు కారణం తన కాశీ (Kashi) యాత్రేనని చెప్పారు.

ఎప్పుడూ సంప్రదాయ చీరకట్టులోనే కన్పించే సుధామూర్తి (Rajya Sabha MP Sudha Murty) ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన షాపింగ్‌కు సంబంధించి ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. ‘‘కాశీ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి మనకు నచ్చింది వదిలేస్తే మంచిదనే సంప్రదాయం ఉంది. నాకు షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఓ సారి వారణాసి వెళ్లినప్పుడు గంగా నదిలో నేను షాపింగ్‌ని వదిలేశా. మరీ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా. అలా గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనలేదు. ఉన్న వాటినే మళ్లీ మళ్లీ కడుతున్నా. మా తల్లిదండ్రులు, తాతముత్తాలు ఉన్నంతలో పొదుపుగా జీవించారు. వారి నుంచే నాకు ఈ నిరాడంబరత అలవాటైంది. మా అమ్మ కబోర్డులో కేవలం 8-10 చీరలే ఉండేవి. మా బామ్మ దగ్గర నాలుగే ఉండేవి. నేను కూడా వారిలాగే పొదుపుగా జీవించాలనుకున్నా’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇన్నేళ్లలో నేనెప్పుడూ చీరలు కొనలేదు. నా సోదరీమణులు, స్నేహితులే అప్పుడప్పుడు వాటిని నాకు బహుమతిగా ఇస్తారు. షాపింగ్‌ వదిలేసిన తర్వాత తొలినాళ్లలో నా అక్కాచెల్లెళ్లు ఏటా రెండు చీరలు పెట్టేవారు. అవి ఇవ్వొద్దని ఆ తర్వాత వారికి చెప్పా. గత 50 ఏళ్లుగా నేను చీరలే కడుతున్నా. నాకు అందులోనే ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది’’ అని సుధామూర్తి తెలిపారు.

ఇటీవల పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల సమయంలో సుధామూర్తి ఎగువ సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘‘9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సినేషన్ (Cervical Cancer Vaccination) ఇస్తుంటారు. దానిని తీసుకుంటే.. క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి.. అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం దానిని అందివ్వాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని తన మనసులో నాటుకుపోయిన ఆ మాటల సారాన్ని ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని