Super Vasuki: 5 ఇంజిన్లు, 295 వ్యాగన్‌లు, 3.5 కి.మీల పొడవు.. ఈ రైలును చూశారా..?

భారతీయ రైల్వే(Indian Railway) మరో ఘనతను సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3.5 కి.మీల పొడవైన గూడ్స్‌ రైలు ‘సూపర్‌ వాసుకి(Super Vasuki)’ని విజయవంతంగా పరీక్షించింది....

Published : 16 Aug 2022 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ రైల్వే(Indian Railway) మరో ఘనతను సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3.5 కి.మీల పొడవైన గూడ్స్‌ రైలు ‘సూపర్‌ వాసుకి(Super Vasuki)’ని విజయవంతంగా పరీక్షించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(Azadi ka Amrit Mahotsav)’లో భాగంగా ఆగ్నేయ మధ్య రైల్వే(SECR) జోన్‌ పరిధిలో.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి కోర్బా వరకు ఈ సరకు రవాణా రైలు ప్రయాణించింది. ఐదు ఇంజిన్లు, 295 లోడెడ్ వ్యాగన్‌లతో మొత్తం 27 వేల టన్నుల బొగ్గును ఒకేసారి తరలించింది. ఒకే రైలులో ఇంత మొత్తంలో బొగ్గు రవాణా.. భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఒక ట్రిప్‌లో 9000 టన్నుల బొగ్గును మోసుకెళ్లే రైల్వే రేక్‌(ఒక్కొక్కటి 100 టన్నులతో 90 వ్యాగన్లు)ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.

‘సూపర్ వాసుకి’ తరలించే బొగ్గుతో.. 3000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఒక రోజు పూర్తిగా నడపొచ్చు. గతేడాది సైతం వాసుకి, త్రిశూల్ పేర్లతో రైల్వేశాఖ పొడవైన సరకు రవాణా రైళ్లను నడిపింది. అయితే ఆ ఏర్పాట్లు సూపర్ వాసుకి(3.5 కి.మీ)తో పోల్చితే చిన్నవే(2.8 కి.మీ). ఇదిలా ఉండగా.. రైల్వేశాఖ ఈ పొడవైన సరకు రవాణా రైళ్లను తరచుగా ఉపయోగించాలని యోచిస్తోంది. ముఖ్యంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించేందుకు, డిమాండ్ సీజన్‌లో వీలైనంత ఎక్కవ బొగ్గు రవాణా చేసేందుకు వినియోగించాలని భావిస్తోంది. ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ పూర్తయితే.. ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా పొడవైన గూడ్స్‌ రైళ్లను నడిపేందుకు మరింత వీలు కలుగుతుందని రైల్వేశాఖ భావిస్తోంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని