ఒంటరితనం భరించలేనంటూ జైన్‌ లేఖ.. వివాదంగా తిహాడ్ జైలు సిబ్బంది నిర్ణయం

ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain) గదిలోకి ఇద్దరు ఖైదీలను తరలించి, తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసి, చర్యలు ప్రారంభించారు. 

Updated : 15 May 2023 14:17 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) సీనియర్ నేత సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain) జైలు జీవితం తరచూ వివాదం అవుతూనే ఉంది. తాజాగా ఆయన ఉంటున్న జైలు గదిలోకి ఇద్దరు ఖైదీలను తరలించడంపై తిహాడ్‌ జైలు(Tihar prison) సూపరింటెండెంట్‌కు నోటీసులు అందాయి. జైన్ రాసిన లేఖే ఈ వివాదానికి కారణమైంది. ఇంతకీ ఏం జరిగింటే..?

నగదు అక్రమ చలామణి(Money laundering) కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain) చాలాకాలంగా తిహాడ్‌ జైల్లో అత్యంత భద్రత కలిగిన గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన మే 11న జైలు అధికారులకు లేఖ రాశారు. ‘ఒంటరితనం వల్ల నేను చాలా ఆందోళనకు గురవుతున్నాను. ఒంటరిగా ఉండకుండా తరచూ ఎక్కువ మందితో కలవాలని వైద్యులు సూచించారు. నేనుంటున్న గదిలో కనీసం ఇద్దరు వ్యక్తుల్ని నాకు తోడుగా ఉంచాలని కోరుతున్నా’ అని జైన్‌ అభ్యర్థించారు. ఆ లేఖలో ఆయన ఇద్దరు వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. దాంతో సూపరింటెండెంట్.. ఆ ఇద్దరు ఖైదీలను ఆయన గదికి తరలించారు. జైలు పాలనాధికారులతో చర్చించకుండా ఆ అధికారి తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై ఆయనకు వెంటనే నోటీసులు అందడమే కాకుండా చర్యలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఇద్దరు ఖైదీలను మునుపటి స్థానాలకు మార్చారు. 

గతంలో కూడా జైన్‌ జైలు జీవితానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు వెలుగులోకి రాగా.. అవి చర్చనీయాంశంగా మారాయి. తిహాడ్‌ జైల్లో ఆయనకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే వాటిని ఆప్‌ తోసిపుచ్చింది. కోర్టు అనుమతి ప్రకారం వైద్య చికిత్సలో భాగంగా ఈ సదుపాయాలు, ఆక్యుప్రెజర్‌ అందిస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని