Supertech: ఆ 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత గడువు పొడిగింపు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల (ట్విన్‌ టవర్స్‌) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు .....

Published : 17 May 2022 17:41 IST

* ఆగస్టు 28 కల్లా కూల్చివేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల (ట్విన్‌ టవర్స్‌) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత గడువును మూడు నెలల పాటు పొడిగించింది. గతంలో మే 22న కూల్చి వేయాల్సిందేనంటూ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ భవనాల కూల్చివేత కోసం నియమించిన ఏజెన్సీ ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ మూడు నెలల సమయం కోరుతోందని, అందువల్ల కూల్చివేత గడువు పెంచాలంటూ ఇంటీరియం రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పీ) అనే సంస్థ సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, పీఎస్‌ నరసింహలతో కూడిన బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. భవనాల కూల్చివేతకు ముందు నిర్వహించిన టెస్ట్‌ బ్లాస్ట్‌ తర్వాత ఈ నిర్మాణాలు ఊహించిన దానికన్నా దృఢంగా, స్థిరంగా ఉన్నట్టు ఎడిఫైస్‌ సంస్థ గుర్తించిన విషయాన్ని ఐఆర్‌పీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, గడువు పొడిగింపునకు అమికస్‌ క్యూరీ అడ్వకేట్‌ గౌరవ్‌ అగర్వాల్‌ కూడా అంగీకరించడంతో ఆగస్టు 28 కల్లా ఈ 40 అంతస్తుల భవనాలను కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని బెంచ్‌ ఆదేశించింది. అలాగే, స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని కోరింది.

నిబంధనలు ఉల్లంఘిస్తూ నొయిడాలోని సెక్టార్‌ 93లో సూపర్‌టెక్‌ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను అక్రమ నిర్మాణాలని సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తేల్చిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. 3 నెలల్లోగా వాటిని కూల్చివేయాలని తొలుత ఆదేశించింది. ఈ మేరకు గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కూల్చివేత ఖర్చు మొత్తాన్ని సూపర్‌టెక్‌ భరించాలని సూచించింది. అంతేగాక, జంట టవర్లలో దాదాపు వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. వాటిని కొన్న వారందరికీ రెండు నెలల్లోగా 12శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఈ ట్విన్ టవర్స్‌లో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. వీటిని కూల్చివేసేందుకు మే 22న మధ్యాహ్నం 2.30 గంటలకు సమయం కూడా ఫిక్స్‌ చేశారు. స్థానిక అధికారులు ఆ బాధ్యతను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ చేతిలో పెట్టారు. అలాగే ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు 2,500 నుంచి 4,000 కిలోల పేలుడు పదార్థాలు అవసరమవుతాయని అంచనా. అంతటి భారీ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 9 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని సంస్థ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో కూల్చివేత ప్రక్రియ వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని