Supreme Court: సుప్రీంకోర్టు జడ్జీలందరూ అనుభవజ్ఞులే.. న్యాయమూర్తిని తప్పుబట్టిన వకీలుపై సీజేఐ ఆగ్రహం

`సుప్రీంకోర్టు జడ్జిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదిని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తీవ్రంగా మందలించారు.

Updated : 10 Jul 2024 06:58 IST

దిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదిని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తీవ్రంగా మందలించారు. సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ అనుభవజ్ఞులేనని స్పష్టంచేశారు.  

సుప్రీంకోర్టులో మంగళవారం జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నుంచి అశోక్‌ పాండే అనే న్యాయవాదికి ప్రతికూల ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఆయన సీజేఐ ఉన్న కోర్టు గదిలోకి వడివడిగా వచ్చారు. తన అడ్వకేట్‌ లైసెన్సును రద్దు చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించినట్లు ఆరోపించారు. దీనిపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఒకింత అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఇదే కోర్టులోని మరో ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై అపీళ్లకు ఇక్కడ తావులేదు. ఆ ఆదేశాలపై మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే.. రివ్యూ పిటిషన్‌ వేయండి. ఈ న్యాయస్థానంలోని జడ్జీలందరూ అనుభవజ్ఞులే. న్యాయవాదులుగా వారికి దశాబ్దాల అనుభవం కూడా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాను కొన్ని ప్రజాహిత వ్యాజ్యాల (పిల్స్‌)ను దాఖలు చేశానని, వాటిపై తానే వ్యక్తిగతంగా వాదనలు వినిపించానని పాండే చెప్పారు. తాజాగా జరిమానా ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ‘‘అయితే న్యాయమూర్తి నన్ను కోర్టు గది నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. నా లైసెన్సును కూడా రద్దు చేస్తానని హెచ్చరించారు’’ అని పేర్కొన్నారు. పాండే తీరుపై జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మీ వాదన వింటుంటే నాకు సహనాన్ని కోల్పోయే పరిస్థితి వస్తోంది. వేరే కోర్టు గదుల్లో ఏం జరుగుతోందో అర్థం చేసుకోగలను. చట్టప్రకారం మీరు ఉపశమనాన్ని కోరండి’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. అయినా పాండే తన ధోరణిని మార్చుకోలేదు. ‘పిల్‌’ వేసిన పిటిషనర్‌పై జరిమానా విధిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ దశలో ఆయనకు నచ్చజెప్పేందుకు సీజేఐ ప్రయత్నించారు. కోర్టుల్లో కొన్ని సందర్భాల్లో పరిస్థితి వేడెక్కుతుంటుందని చెప్పారు. అంతకుముందు పాండేకు సర్వోన్నత న్యాయస్థానంలోని రెండు వేర్వేరు ధర్మాసనాల వద్ద చేదు అనుభవం ఎదురైంది. ‘పసలేని’ వ్యాజ్యం దాఖలు చేసినందుకు గతంలో విధించిన రూ.50వేల జరిమానాను చెల్లించకపోవడంపై జస్టిస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు వారాల్లోగా దాన్ని జమ చేయాలని స్పష్టంచేసింది. మరికొంత సమయం కావాలన్న పాండే విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ‘‘మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. హామీ ఇచ్చినప్పటికీ మీరు జరిమానా సొమ్మును జమ చేయలేదు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు ఆ సొమ్మును చెల్లించలేనని మీరు చెప్పజాలరు. డబ్బు కట్టకుంటే.. కోర్టు ధిక్కార నోటీసును జారీచేస్తాం’’ అని ధర్మాసనం హెచ్చరించింది. దీనికి పాండే బదులిస్తూ.. ‘‘2023 నుంచి నాకు ఒక్క కేసు కూడా రాలేదు. నా విదేశీ పర్యటన ఖర్చులను నా సంతానమే భరించింది’’ అని తెలిపారు. ఈ వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. 

అనంతరం జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని మరో ధర్మాసనం కూడా పాండేపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణను సవాల్‌ చేసిన సందర్భంలో ఆయనకు ఈ బెంచీ గతంలో రూ.లక్ష జరిమానా విధించింది. ఆ సొమ్మును చెల్లించకపోవడంపై తాజాగా మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని