Supreme Court: స్వలింగ సంపర్క న్యాయవాదికి సుప్రీం కోర్టు మద్దతు

సీనియర్‌ లాయర్‌ సౌరబ్‌ కిర్‌పాల్‌కు సుప్రీం కోర్టు మద్దతుగా నిలిచింది. స్వలింగ సంపర్కుడైనంత మాత్రాన ఆయన్ని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించకపోవడం ఆయన హక్కులను కాలరాసినట్లే అవుతుందని తెలిపింది.

Published : 20 Jan 2023 01:43 IST

దిల్లీ: బహిరంగంగా స్వలింగ సంపర్కుడినని ప్రకటించుకున్న సీనియర్‌ న్యాయవాది సౌరబ్‌ కిర్‌పాల్‌ (Saurabh Kirpal) కు సుప్రీం కోర్టు (Supreme Court) మద్దతు పలికింది. జడ్జిగా నియమించాలంటూ ఇప్పటికే పలుమార్లు సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఆమోదించకపోవడంపై తొలిసారి అత్యున్నత ధర్మాసనం స్పందించింది. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న అంశాన్ని మొదటిసారి బయటపెట్టింది. కిర్‌పాల్‌ స్వలింగ సంపర్కుడైనంత మాత్రాన ఆయన్ని జడ్జిగా నియమించకపోవడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. కిర్‌పాల్‌ జీవిత భాగస్వామి గురించి కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (RAW) నుంచి వచ్చిన సమాచారం వాస్తమే అయినప్పటికీ,  దేశ భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడబోదని అభిప్రాయపడింది.

‘‘కిర్‌పాల్‌ జీవిత భాగస్వామి స్విట్జర్లాండ్‌కు చెందినంత మాత్రాన దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనడంలో అర్థం లేదు.అందులోనూ స్విట్జర్లాండ్‌తో మన దేశానికి స్నేహ సంబంధాలున్నాయి. దేశంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత పదవుల్లో పని చేస్తున్న కొంతమంది వ్యక్తుల భార్యల్లో విదేశీయులు కూడా ఉన్నారు’’ అంటూ రాసిన లేఖపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌క కౌల్‌, జస్టిస్‌ ఎంకే జోసెఫ్‌ సంతకాలు చేశారు. సౌరబ్‌  తన వ్యక్తిగతానికి సంబంధించిన విషయం బహిరంగా చెప్పడం అతడి గొప్పదనమని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల దృష్ట్యా.. ఆ కారణంతో అతని ఎంపికను తిరస్కరించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

గతంలో కిర్‌పాల్‌ బహిరంగంగా స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. తొలిసారిగా దిల్లీ హైకోర్టు కొలీజియం తొలిసారి 2017 అక్టోబరు 13న ఆయన పేరును సిఫార్సు చేసింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కోరింది. 2018 సెప్టెంబరు 4న సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంది. మరో మూడు విడతల్లో 2019 జనవరి 16, అదే ఏడాది ఏప్రిల్‌ 1, ఈ ఏడాది మార్చి2న కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. ఆయన స్వలింగ సంపర్కుడని ప్రస్తావించకుండా ఆయన జీవిత భాగస్వామి విదేశీయులని.. ఆ భాగస్వామి స్విస్‌ రాయబార కార్యాలయంలో పని చేస్తున్నందున దేశ భద్రతకు ముప్పు అని నివేదించడంతో  కేంద్రం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని