SC: ధన్‌ఖడ్‌, రిజిజులపై పిటిషన్‌.. విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే లాయర్ల సంఘం వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనల విషయంలో సుప్రీం కోర్టు విశాల దృక్పథంలో వ్యవహరిస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైందని తెలిపింది.

Published : 15 May 2023 18:05 IST

దిల్లీ: న్యాయవ్యవస్థ (Judiciary), రాజ్యాంగ ఔన్నత్యానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజులను రాజ్యాంగబద్ధ పదవుల నుంచి తప్పించాలని బాంబే లాయర్ల సంఘం వేసిన పిటిషన్‌ విచారణకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. అంతకుముందు ఇదే అంశంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు (Bombay High Court) కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాంబే లాయర్ల సంఘం (Bombay Lawyers Association) తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఏ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఈ విషయంలో బాంబే హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది. ‘బాంబే హైకోర్టు దృష్టి కోణం సరైనదేనని భావిస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనల విషయంలో సుప్రీం కోర్టు విశాల దృక్పథంతో వ్యవహరిస్తుంది’ అని పేర్కొంటూ.. పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది.

‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని రిజిజు బహిరంగంగా వ్యాఖ్యానించి సుప్రీం కోర్టును అవమానించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన కేశవానంద భారతి కేసు తీర్పును ఉపరాష్ట్రపతి తప్పుపట్టారు’ అని ఆరోపిస్తూ లాయర్ల సంఘం తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని కొట్టిపారేస్తూ.. ‘సుప్రీం కోర్టు విశ్వసనీయత ఎంతో ఉన్నతమైనది. వ్యక్తుల వ్యాఖ్యలు, ప్రకటనల ద్వారా దానిని దెబ్బతీయడం, అడ్డుకోవడం అసాధ్యం’ అని పేర్కొంది. తాజాగా సుప్రీం కోర్టు సైతం దీన్ని సమర్థించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని