Supreme Court: నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: కొన్నిసార్లు మహిళల ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెలసరి సెలవుల అంశంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 08 Jul 2024 16:33 IST

దిల్లీ: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు (Menstrual Leave) మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చని అభిప్రాయపడింది.

ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మిగతా రాష్ట్రాల్లోనూ దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ‘‘మహిళలకు నెలసరి సెలవులు (Period Leave) ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సహించినట్లు అవుతుంది. అయితే, వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చు. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చు. అది మేం కోరుకోవట్లేదు. మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్‌ ఆరోగ్య బీమా

అంతేగాక.. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృత చర్చలు జరిపి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పిటిషనర్‌ తన అభ్యర్థనను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నెలసరి సెలవులపై పిటిషన్‌ దాఖలవగా.. దానిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినుల (Women Employees)కు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. ఇక, ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్‌ లీవ్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని