SC: ‘సుప్రీం’కు ఇద్దరు కొత్త జడ్జీలు.. ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ

సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

Published : 19 May 2023 16:13 IST

దిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో ఇద్దరు న్యాయమూర్తులు కొత్తగా కొలువుదీరారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా (Justice Prashant Kumar Mishra), సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ (Kalpathy Venkataraman Viswanathan)లతో సీజేఐ (CJI) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకంతో సుప్రీం కోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య గరిష్ఠ పరిమితి 34కు (సీజేఐతో కలిపి) చేరింది.

సుప్రీం కోర్టు జడ్జీలుగా జస్టిస్ మిశ్రా, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ పేర్లను సీజేఐ నేతృత్వంలోని కొలీజియం మే 16న కేంద్రానికి సిఫారసు చేసింది. రెండు రోజుల్లోనే ఈ నియామకాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు. నూతన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సైతం ట్విటర్‌ వేదికగా ఈ నియామకాలను ప్రకటించారు. అయితే, సుప్రీం కోర్టులో పూర్తిస్థాయి జడ్జీల సంఖ్య కొద్ది కాలం మాత్రమే కొనసాగనుంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి..

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తిగా 13 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైకోర్టుల న్యాయమూర్తుల ఆల్‌ ఇండియా సీనియారిటీ జాబితాలో 21వ స్థానంలో ఉన్నారు.

బార్‌ కౌన్సిల్‌ నుంచి నేరుగా సుప్రీంకు..

తమిళనాడుకు చెందిన జస్టిస్ విశ్వనాథన్.. బార్ కౌన్సిల్‌ నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. సీనియార్టీ ప్రకారం 2030 ఆగస్టు 11న జస్టిస్ జేబీ పార్దీవాలా పదవీ విరమణ అనంతరం జస్టిస్ విశ్వనాథన్ సీజేఐగా నియమితులు కానున్నారు. 2031 మే 25వరకు ఆ పదవిలో ఉంటారు. న్యాయవాదిగా విస్తృత కేసులు వాదించిన జస్టిస్ విశ్వనాథన్.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపైనా ఇటీవల పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు