Satyendar Jain: సత్యేందర్‌ జైన్‌కు మధ్యంతర బెయిల్‌

దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌( AAP leader Satyendar)కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం మీడియా ఎదుట ఎలాంటి ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేసింది.

Updated : 26 May 2023 13:55 IST

దిల్లీ: ఆప్‌ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌( AAP leader Satyendar)కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట లభించింది. శుక్రవారం న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆరువారాలకు ఈ నిర్ణయం తీసుకొంది. అయితే, కొన్ని షరతులు కూడా విధించింది. అనుమతి లేకుండా దిల్లీ దాటి వెళ్లకూడదని, మీడియా ముందు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది.

మనీలాండరింగ్‌ కేసులో గతేడాది మే నెలలో అరెస్టయి తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న జైన్ ఆరోగ్యం గురువారం క్షీణించింది. జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయన్ను దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని జైలు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కూడా స్పందించిన సంగతి తెలిసిందే. కళ్లుతిరగడంతో ఆయన బాత్‌రూమ్‌లో కిందపడిపోయారని, దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారని తెలిపింది. గతంలో ఆయన ఇలాగే ఓసారి బాత్‌రూమ్‌లో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని చెప్పింది.

మరోవైపు గత సోమవారం కూడా జైన్‌ అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు బయటికొచ్చిన చిత్రాలు ఆప్‌ నేతలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అందులో ఆయన బక్కచిక్కి పోయి చాలా నీరసంగా కన్పించారు. వెన్నెముకకు గాయమవడంతో నడుముకు బెల్ట్‌ పెట్టుకున్నారు. 

కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్‌ (Satyendar Jain).. పలుమార్లు బెయిల్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున పిటిషన్‌ వేసిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ.. జైల్లో ఉన్న సమయంలో జైన్‌ 35 కిలోల బరువు తగ్గారని ధర్మాసనం ముందు విన్నవించారు. పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్‌ అత్యవసర విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరైంది. 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని