The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ని ఎందుకు నిషేధించారు..?: బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

పశ్చిమ్ బెంగాల్‌ రాష్ట్రం ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) సినిమా ప్రదర్శనను నిషేధించడంపై నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం ప్రదర్శితమవుతుంటే.. బెంగాల్‌ నిషేధించడానికి గల కారణం ఏంటని కోర్టు ప్రశ్నించింది. 

Published : 12 May 2023 18:03 IST

దిల్లీ: ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది చూడాల్సిన సినిమా అని కొన్ని రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపు ఇస్తుంటే.. పశ్చిమ్ బెంగాల్(West Bengal) మాత్రం ఆ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించింది. దీనిపై ఆ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సినిమాను నిషేధించడం వెనక ఉన్న హేతుబద్ధత ఏంటని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఇదీ చదవండి: ‘ది కేరళ స్టోరీ’.. అసలేమిటీ వివాదం..?

‘ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది కదా.. మరి మీ ప్రభుత్వం దీనిని ఎందుకు నిషేధించింది..? దీనికి వెనక ఉన్న హేతుబద్ధత ఏంటి..?’ అని ప్రశ్నిస్తూ బెంగాల్(West Bengal) ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించలేదు కానీ.. శాంతి భద్రతలదృష్ట్యా దీనిని ప్రదర్శించకూడదని థియేటర్ యజమానులు నిర్ణయం తీసుకున్నారు.

మరోపక్క, ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ్‌ బెంగాల్‌. రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకూడదన్న ఉద్దేశంతో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు. ప్రభుత్వ చర్య వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని సినీ నిర్మాతలు ఇటీవల సుప్రీం మెట్లెక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని